- 2025లో రూ.31వేల కోట్ల నష్టం
- ప్రభుత్వ సంస్థలకూ భారీ లాస్
న్యూఢిల్లీ: భారతదేశ సాధారణ బీమా రంగం అండర్ రైటింగ్ నష్టాలు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.45,279 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.31,043 కోట్లుగా నమోదయ్యాయి. బీమా రంగంలోని 32 కంపెనీల్లో ఒక్కటి మాత్రమే కంబైండ్ రేషియోను 100 శాతం లోపు ఉంచుకోగలిగింది. నాన్ లైఫ్ పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.3.36 లక్షల కోట్లకు చేరింది.
బీమా సంస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అండర్ రైటింగ్ లాభం ముఖ్యమైన కొలమానం. ఇన్సూరెన్స్ మార్కెట్లో నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు భారీ వాటా ఉంది. వీటికి రూ.29,071 కోట్ల సంచిత అండర్ రైటింగ్ నష్టం వచ్చింది. గత ఏడాది ఈ నష్టాలు రూ.18,863.24 కోట్లుగా ఉండేవి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని సమీక్షించింది.
లాభదాయక వ్యాపారాలపై దృష్టి పెట్టాలని, క్లెయిమ్ నిష్పత్తిని తగ్గించాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించింది. ప్రైవేట్ రంగ సాధారణ బీమా సంస్థల సంచిత నష్టాలు రూ.16,682.34 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇది రూ.14,033.31 కోట్లుగా ఉంది. టాటా ఏఐజీ సంస్థ అత్యధికంగా రూ.2,442.25 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఐసీఐసీఐ లంబార్డ్ నష్టం రూ.1,024 కోట్లుగా నమోదైంది.
బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ మెరుగైన పనితీరు కనబరిచి రూ.103.29 కోట్ల నష్టంతో ఉంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో తన నష్టాలు రూ.1,042.89 కోట్లకు తగ్గాయి. యూనివర్సల్ సోంపో మినహా అన్ని సంస్థల కంబైండ్ రేషియో 100 శాతం దాటింది.
