స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం జఫర్‌గఢ్, చిల్పూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రెండు మండలాల్లో 74 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.76,08,584, 59 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.22,73,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదుల, మల్లన్నగండి రిజర్వాయర్ల ద్వారా 6ఎల్, 7ఎల్ కాలువలను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందిస్తామన్నారు. చిల్పూర్‌లో నూతన మండల కార్యాలయాల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయడంతో పాటు బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
