సెప్టెంబర్ 30 వరకు కుట్టు మిషన్ల స్కీమ్‌‌‌‌ అప్లికేషన్లకు గడువు..

సెప్టెంబర్ 30 వరకు కుట్టు మిషన్ల స్కీమ్‌‌‌‌ అప్లికేషన్లకు గడువు..
  • ఇప్పటివరకు 3.5 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.

 గత నెలలో ప్రారంభమైన ఈ దరఖాస్తు ప్రక్రియకు విశేష స్పందన లభించగా, ఇప్పటివరకు 3.5 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఈ నెల 30వ తేదీ లోపు టీజీఓబీఎంఎంఎస్‌‌‌‌ పోర్టల్ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. గడువులోగా దరఖాస్తులు చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.