వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో ప్రముఖ రీసెర్చర్ల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఈ దశాబ్దం చివరినాటికి ఏఐ కారణంగా మానవాళి అంతమయ్యే అవకాశం ఉందంటూ ఆంత్రోపిక్ మాజీ రీసెర్చర్ జాకోబ్ కాక్సన్ హెచ్చరించిన కొద్దిరోజులకే, మరో ఏఐ సేఫ్టీ రీసెర్చర్ ప్రముఖ ఏఐ ల్యాబ్ నుంచి బయటికి వచ్చి తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఏఐ మరింత అడ్వాన్స్‌డ్ స్టేజీకి వెళ్తే మానవాళికి వచ్చే ఐదేళ్లలోనే తీవ్ర ముప్పు తప్పదని తాజాగా గూగుల్ డీప్‌మైండ్ ఏజీఐ సేఫ్టీ టీమ్‌లో పనిచేసిన జోష్ ఎంగెల్స్ తేల్చిచెప్పారు. తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేసినట్టు ప్రకటించారు. ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన ఆఫర్లను సైతం తిరస్కరించినట్టు ఆయన వెల్లడించారు. ఏఐ సేఫ్టీ చర్యల కోసం ఏర్పాటైన ఏఐ ఎవాల్యుయేషన్ ఆర్గనైజేషన్ ‘ఎంఈటీఆర్’లో చేరానని తెలిపారు.
మనుషుల కన్నా తెలివిమీరిపోయి.. స్వంతంగా ఏఐ మోడల్స్‌ను సృష్టించగల ఆర్టిఫిషియల్ సూపర్‌ఇంటెలిజెన్స్(ఏఎస్ఐ)ను క్రియేట్ చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని ఎంగెల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వాన్స్‌డ్ ఏఐకి సంబంధించిన సవాళ్లు తారస్థాయికి చేరినందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. తాను మూడు వారాల క్రితం డీప్‌మైండ్‌ను వీడినట్లు పేర్కొన్నారు.
‘‘రాబోయే ఐదేళ్లలో ఏఐ సిస్టమ్స్ మానవాళికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉందని నేను భావిస్తున్నా. ఏఐ సేఫ్టీ అనేది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సమస్యగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది” అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏఐ మోడళ్ల సృష్టి కంటే.. వాటి వల్ల సమస్యలు రాకుండా సేఫ్టీ కోసం చేపట్టాల్సిన చర్యల విషయంలో చాలా వెనకబడ్డామని జోష్ ఎంగెల్స్ చెప్పారు. సేఫ్టీ రీసెర్చ్ అందుకునేలా ఏఐ అభివృద్ధి తగినంత వేగంతో నెమ్మదించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
