నాలుగేండ్లు పగ: ప్రేమ జంటను కలిపాడని గొడవ పెట్టుకుని ప్రాణాలు తీశాడు.. లాలాగూడ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో ఘటన

నాలుగేండ్లు పగ: ప్రేమ జంటను కలిపాడని గొడవ పెట్టుకుని ప్రాణాలు తీశాడు..  లాలాగూడ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో ఘటన

తార్నాక, వెలుగు: ఓ ప్రేమ జంటను కలిపిన యువకుడిపై యువతి తరఫు బంధువులు పగ పెంచుకున్నారు. నాలుగేళ్లుగా పగతో రగిలిపోతూ అతడిని కాపుకాసి గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో జరిగింది. 

స్థానికుల వివరాల ప్రకారం.. తుకారాంగేట్‌‌ బుద్ధనగర్‌‌కు చెందిన కార్తీక్‌‌(40) తన ఇంటి ఎదురుగా ఉంటున్న ఓ యువతి ప్రేమ వివాహానికి సహకరించాడు. దీంతో అప్పటి నుంచి యువతి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు కార్తీక్‌‌పై కక్ష పెంచుకున్నారు. 

ఈ క్రమంలో ఆదివారం బస్తీలో వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేస్తుండగా యువతి బంధువులు, అన్నదమ్ములు కార్తీక్‌‌తో గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, గొడవ జరిగింది.

 అనంతరం యువతి అన్నదమ్ములు తమ స్నేహితులతో కలిసి కార్తీక్‌‌పై తీవ్రంగా దాడి చేసి, గొంతు కోసి అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న కార్తీక్‌‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్‌‌ మృతిచెందాడు.

పోలీసులు సర్దిజెప్పి వెళ్లాక..

కాగా, హత్యకు గంట ముందు బస్తీలో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన కాసేపటికే మళ్లీ ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో కార్తీక్‌‌ హత్యకు గురయ్యాడు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉండి ఉంటే హత్య జరిగేది కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్తీక్‌‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.