- కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు పాదయాత్ర చేయ్
- నీళ్ల వాటాలో ద్రోహం చేసిన మీ అయ్యను నిలదీయ్
నల్గొండ, వెలుగు: కృష్ణా జలాల్లో ఏపీ చేస్తున్న జల దోపిడీకి కేసీఆరే ప్రధాన సూత్రధారి అని, తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వినాయకచవితి సందర్భంగా నల్గొండ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణ రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి ఏపీ జల దోపిడీకి సహకారం అందించారని మండిపడ్డారు. తెలంగాణ గొంతు కోసి పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కెపాసిటీని పెంచారని, రోజుకు 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించేలా జీవోలు ఇప్పించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ చేసిన పాపాల వల్లే నేడు కరవు పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి చుక్క నీరు తీసుకోలేని దుస్థితి వచ్చిందన్నారు. నాడే జలదోపిడీని అడ్డుకుని ఉంటే నేడు తెలంగాణలో కరవును సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లమని స్పష్టం చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిందని, కృష్ణా జలాల్లో మన న్యాయమైన వాటాను సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రపై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నీటి కష్టాలకు బీఆర్‌ఎస్ పాలనే కారణమన్న మంత్రి, కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ముందు హైదరాబాద్ నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకు పాదయాత్ర చేయాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎందుకు ద్రోహం చేశావని తండ్రి కేసీఆర్‌ను నిలదీయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో అనుసంధానించేలా డబుల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను దేశంలోనే అత్యుత్తమ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్అండ్ బీ ఎస్ఈ మోహన్, ఆర్డీవో అశోక్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మలమోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.
