సన్న వడ్ల బోనస్‌‌కు రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు!

సన్న వడ్ల బోనస్‌‌కు రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు!
  • ఈ నెల 17వరకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
  •     ఎంపిక చేసిన ఏడు రకాల సన్నాలకే బోనస్
  •     విత్తన డీలర్ల వద్ద కొనుగోలు వివరాల నమోదు
  •      ఇతరుల నుంచి సీడ్స్ తెచ్చుకున్న వారికి ఏఈవోల ద్వారా అవకాశం
  •     రిజిస్ట్రేషన్‌‌ చేసుకుంటేనే క్వింటాల్‌‌కు రూ.500 బోనస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  వానాకాలం సీజన్‌‌లో సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్‌‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును వ్యవసాయ శాఖ పెంచినట్లు సమాచారం. ముందుగా సెప్టెంబర్‌‌ 10 వరకు గడువు విధించగా.. నమోదు ప్రక్రియ పూర్తికాని రైతులకు మరికొంత అవకాశం కల్పించేందుకు ఈ నెల 17 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు. బోనస్‌‌ పొందాలంటే రైతులు తాము సాగు చేసిన సన్న వరి రకం, విత్తనాల వివరాలను ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి. సన్న వడ్లు సాగు చేసిన రైతులు రిజిస్ట్రేషన్‌‌ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని వ్యవసాయ శాఖ సూచించింది.  గడువులోగా వివరాలు నమోదు చేసుకోకుంటే కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించినా రూ.500 బోనస్‌‌ పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులు తమ వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఏడు రకాలకే బోనస్‌‌..

ఈ వానాకాలం సీజన్‌‌లో  బీపీటీ-5204 (సాంబా మసూరి), ఆర్‌‌ఎన్‌‌ఆర్‌‌-15048 (తెలంగాణ సోనా), కేఎన్‌‌ఎం-1638, జైశ్రీరామ్‌‌, హెచ్‌‌ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్‌‌-44, కేఎన్‌‌ఎం-7715  రకాల సన్న ధాన్యానికే ప్రభుత్వం క్వింటాల్‌‌కు రూ.500 చొప్పున బోనస్‌‌ ఇవ్వనుంది. అధిక దిగుబడులు, మార్కెట్లో డిమాండ్‌‌, దేశీయ, ఎగుమతి అవకాశాలు ఉన్న రకాల సాగును ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. గతంలో సన్న ధాన్యంలో పలు రకాలకు బోనస్‌‌ వర్తించగా.. ఈసారి ఎంపిక చేసిన ఏడు రకాలకే పరిమితం చేశారు. దీంతో ఇతర సన్న రకాలను సాగు చేసిన రైతులకు బోనస్‌‌ వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రకాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ గ్రామస్థాయిలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.

వివరాలు సరిపోలితేనే బోనస్‌‌

విత్తనాల నమోదు, పంట నమోదు వివరాలను కొనుగోలు సమయంలో పరిశీలించనున్నారు. ఆన్‌‌లైన్‌‌లో నమోదైన వివరాలు, క్షేత్రస్థాయి పంట వివరాలు సరిపోలిన తర్వాతే బోనస్‌‌ చెల్లించే విధానం అమలు చేయనున్నారు. దళారులు రైతుల నుంచి ముందుగానే తక్కువ ధరకు సన్న ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల పేరుతో బోనస్‌‌ పొందకుండా ఈ ట్రాకింగ్‌‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

పెరుగుతున్న సన్నాల సాగు

సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌‌ ఇవ్వడంతో రాష్ట్రంలో ఈ రకాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. రేషన్‌‌ కార్డుదారులకు సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్న రకాల సాగును ప్రోత్సహిస్తోంది. గతంతో పోలిస్తే సన్నాల సాగు విస్తీర్ణం పెరగడానికి బోనస్‌‌ ప్రధాన కారణంగా మారింది. 2026-=27 వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  57.70 లక్షల ఎకరాల్లో వరి సాగు  కాగా.. 119.57 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 45 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని సేకరించేందుకు సివిల్ సప్లయ్స్​శాఖ ప్రణాళిక రూపొందించింది. అయితే ఇప్పటికే 55లక్షల ఎకరాల్లో వరి సాగు 
జరిగింది.

విత్తనాలు కొన్న డీలర్‌‌ వద్దే నమోదు

బోనస్‌‌ చెల్లింపులో అక్రమాలను అరికట్టేందుకు విత్తనాల కొనుగోలు దశ నుంచే పంట వివరాలను నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతులు ఏ డీలర్‌‌ వద్ద సన్న వరి విత్తనాలు కొనుగోలు చేశారో.. అదే డీలర్‌‌ వద్ద తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం విత్తన కొనుగోలు వివరాలు, రైతు గుర్తింపు, సాగు వివరాలను ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేస్తున్నారు. విత్తనాలను డీలర్ల వద్ద కాకుండా ఇతర రైతుల నుంచి, వ్యవసాయ పరిశోధనా సంస్థల నుంచి లేదా సొంతంగా సమకూర్చుకుని సాగు చేసిన వారికి నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అలాంటి రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈవో) సంప్రదించి ఆధార్‌‌, ఫోన్‌‌ నంబర్‌‌, సాగు వివరాలను అందించి ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేసుకోవచ్చు.