విభూతి ఎందుకు పెట్టుకోవాలి.. ఆరోగ్యమా.. ఆధ్యాత్మికమా..!

విభూతి ఎందుకు పెట్టుకోవాలి.. ఆరోగ్యమా.. ఆధ్యాత్మికమా..!

హిందువులు పూజలు.. క్రతువులు..హోమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పురాణాలు.. శాస్త్రాలు చెప్పిన విషయాల్లో ఆధ్యాత్మికంతో పాటు ఆరోగ్యం కూడా ఉంది.  దేవాలయ దర్శనం అనంతరం, పూజ పూర్తయిన తర్వాత లేదా ఇంట్లో నిత్యపూజ చేసే సమయంలో నుదుటిపై విభూతి ధరించడం అనేక మంది హిందువుల దైనందిన జీవితంలో భాగంగా మారింది. అసలు విభూతి ఎందుకు ధరించాలి.. ఆధ్యాత్మికమా.. ఆరోగ్యమా.. పండితులు ఏం చెబుతున్నారు.. 

శివాలయంలో విభూతి ధరించడం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు. అది జీవిత అశాశ్వతత్వాన్ని గుర్తుచేస్తూ, భక్తి, వినయం, ఆత్మజ్ఞానం, ధర్మమార్గంలో నడవాల్సిన అవసరాన్ని బోధించే పవిత్ర ఆధ్యాత్మిక సంప్రదాయమని పండితులు చెబుతున్నారు. విభూతికి  జలుబు, దగ్గు , గొంతు సమస్యలు తగ్గించే శక్తి ఉందని పండితులు చెబుతున్నారు. 

- పరమేశ్వరుడి ఆరాధనలో విభూతికి విశిష్ఠ స్థానం - దాని వెనుక పరమార్థాలు ఉన్నాయంటున్న పండితులు అంటున్నారు. విభూతి అంటే విశేషమైనది అని అర్థం. హోమ ద్రవ్యాలైన దర్భలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయ , మోదుగ, రావి, తులసి మొదలైన కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకలు, నవధాన్యాలు నెయ్యి మొదలైనవి వేసి హోమం చేయగా చివరకు మిగిలిన బూడిదను విభూతి అంటారు. అగ్నికి దహించే గుణం ఉంటుంది. 

శాస్త్రీయ కోణంలో చూస్తే, ఆవు పేడ, పవిత్ర మూలికలతో తయారుచేసే స్వచ్ఛమైన విభూతికి శరీరంలోని అధిక తేమను, చెమటను పీల్చుకునే గుణం ఉంటుందట. ఇది జలుబు, తలనొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు. ఈ విధంగా శివునికి చేసే విభూది పూజ మానవాళికి అటు ఆధ్యాత్మిక ఉన్నతిని, ఇటు శారీరక ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా విభూతిని నుదుటిపైన, ఛాతీ దగ్గర, గొంతుభాగంలోనూ పెట్టుకుంటారు. దీనివల్ల శరీరంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. నుదుటిపై ధరించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

శివారాధనలో భాగంగా నుదుటిపై విభూతిని మూడు అడ్డ గీతలుగా ధరించడాన్ని 'త్రిపుండ్రం' అంటారు. ఇది మనిషిలోని మూడు ప్రధాన దోషాలైన అహంకారం, స్వార్థం, అజ్ఞానాన్ని అధిగమించడాన్ని సూచిస్తుందట. ఈ మూడు గీతలు సృష్టి, స్థితి, లయకారక శక్తులను కూడా ప్రతిబింబిస్తాయని పండితులు చెబుతున్నారు.

ముక్కంటి ఆరాధనలో విబూదికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. "విష్ణుమూర్తి అలంకార ప్రియుడు.. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు" అనేది పెద్దల మాట. భోళాశంకరుడు కేవలం కాస్త విభూతి అభిషేకంతోనే సంతోషించి భక్తుల కోరికలు తీరుస్తాడని చెబుతారు. అందుకే ఆయనను ఆశుతోషుడు అని కూడా పిలుస్తారు. అయితే, శివుడు భౌతికమైన ఆభరణాలకు బదులుగా శరీరం అంతటా విభూతిని ధరించడం వెనుక, భక్తులు స్వామికి భస్మంతో పూజ చేయడం వెనుక.. ఆధ్యాత్మిక, తాత్విక పరమార్థాలు, ఆరోగ్య రహస్యాలు  దాగి ఉన్నాయని పండితులు చెబుతారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.