- సంగారెడ్డి జిల్లాలో ఐదు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో
- రెండు చొప్పున స్కూళ్ల ఎంపిక
- కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా..
- సకల సౌకర్యాలతో టీపీఎస్ ల నిర్మాణం
మెదక్, వెలుగు : విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న హైస్కూల్స్, మోడల్ స్కూల్స్‌నే సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో టీపీఎస్ లుగా అభివృద్ధి చేయనున్నారు.
ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 9 స్కూళ్ల ను ఎంపిక చేశారు. వీటికి రూ.79.60 కోట్లు మంజూరయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 5 టీపీఎస్‌లు ఏర్పాటు కానుండగా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రెండు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ మొదలుకుని ఇంటర్మీడియట్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
రెండు మూడు ఎకరాల విస్తీర్ణం స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అందులో విలీనం చేస్తారు. దాంతో ఒక్కో టీపీఎస్ లో విద్యార్థుల సంఖ్య 1,000 నుంచి 1,500 వరకు ఉండనుంది. టీపీఎస్ ల్లో డిజిటల్ బోధనకు అనుగుణంగా ఆధునిక క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మాడ్రన్ కిచెన్, సురక్షితమైన తాగునీరు తదితర సకల సౌకర్యాలు కల్పించనున్నారు.
ఎక్కడెక్కడ.. ఏ స్కూల్?
- మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలోని గవర్నమెంట్బాయ్స్హైస్కూల్, వెల్దుర్తి మండలం కుకునూర్జిల్లా పరిషత్ హై స్కూల్ ఎంపికయ్యాయి. మెదక్ స్కూల్‌కు రూ.10 కోట్లు, కుకునూర్ స్కూల్ కు రూ.10 కోట్ల చొప్పున కేటాయించారు.
- సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూర్ జిల్లా పరిషత్ హైస్కూల్, దౌల్తాబాద్‌లోని తెలంగాణ మాడల్ స్కూల్ ఎంపికయ్యాయి. చిన్నకోడూర్ స్కూల్ కు రూ.7.50 కోట్లు, దౌల్తాబాద్ స్కూల్ కు రూ.7.80 కోట్లు మంజూరయ్యాయి.
- సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు రూ.10 కోట్లు, నిజాంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ కు రూ.9.20 కోట్లు, మునిపల్లి తెలంగాణ మాడల్ స్కూల్ కు రూ.8.40 కోట్లు, జిన్నారం జడ్పీ హైస్కూల్ కు రూ.7.90 కోట్లు, సదాశివపేట హైస్కూల్‌కు రూ.8.80 కోట్లు మంజూరయ్యాయి.
