కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌‌ దగ్గర ..శుద్ధి కేసులో ఏడుగురు అరెస్ట్

కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌‌ దగ్గర ..శుద్ధి కేసులో ఏడుగురు అరెస్ట్
  • కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌‌ దగ్గర దళితులను అవమానించిన ఘటన 
  • విజయవాడలో తలదాచుకున్న నిందితులను పట్టుకున్న పోలీసులు 

ములుగు, వెలుగు: శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన ఘటనలో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 8వ తేదీన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌‌హౌస్ సమీపంలో ఉన్న వరదరాజపూర్ జంక్షన్ వద్ద కొందరు వ్యక్తులు శుద్ధీకరణ పేరుతో రోడ్డుపై పసుపు నీళ్లు చల్లి దళితులను కించపరిచారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం లీడర్లు మార్కూక్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు.

ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వరదరాజపూర్‌‌కు చెందిన అప్పాల ప్రవీణ్, రెడ్డబోయిన అమరేందర్, శ్రీపతి రాజు, ముచ్చవతి హిమవంత్, అంతని ఐలయ్య, అరికెల రాజు, అంతని మల్లేశంలను నిందితులుగా గుర్తించారు. నిందితులు పరారీలో ఉండగా.. సోమవారం ఏపీలోని విజయవాడలో ఓ లాడ్జ్ లో తలదాచుకున్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌‌కు తరలించినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు మీడియాకు వివరించారు.