- హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి
- మంత్రి పదవి కావాలని నేనెవరినీ అడగలేదు
- సీఎంగా రేవంత్ సమర్థంగానే పనిచేస్తుండ్రు
- భవిష్యత్‌లో బీసీకి సీఎం పదవి దక్కే చాన్స్
- అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచే పోటీ
- పీసీసీ చీఫ్‌గా రెండేండ్ల ప్రయాణం తృప్తిగా ఉంది
- మీడియాతో చిట్‌చాట్‌లో మహేశ్ గౌడ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో నలుగురైదుగురు బీసీలకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను కోరుతున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. తన రెండేళ్ల ప్రయాణం ఎంతో బాధ్యతగా, తృప్తిగా, ఉత్సాహంగా సాగిందన్నారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జీలు దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో బూత్ స్థాయివరకు పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. తన హయాంలోనే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచామని, పంచాయతీ ఎన్నికల్లో 57 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు గెలిచామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో డీసీసీ అధ్యక్షుల పవర్ ఏంటో చూస్తారన్నారు. ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా డీసీసీ అధ్యక్షుడిని కలవాల్సిందేనని, నామినేటెడ్ పదవుల భర్తీలోనూ వారి అభిప్రాయం తీసుకుంటున్నామన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కూడా ఈ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు.
విస్తరణ ఎప్పుడో చెప్పలేం
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని, ఆయన ప్రధాని అయితే తమలాంటి వారికి పదవులు వస్తాయని మహేశ్ గౌడ్ అన్నారు. కుల సర్వేను కేంద్రం తొక్కిపెట్టిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా కుల సర్వే అమలు చేస్తామన్నారు. డీలిమిటేషన్ లేకుండానే ఎన్నికలు జరిగితే తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లు గెలిచేందుకు కృషి చేస్తానన్నారు. తనకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదని, కాంగ్రెస్ లో పదవులు కోరుకుంటే రావని,పనిచేసుకుంటూపోతే వస్తాయన్నారు.
మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరుగుతుందని, అది ఎప్పడు జరిగేది కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తున్నాడన్నారు. ఇప్పుడు బీసీ సీఎం అనడం అప్రస్తుతమని, అయితే భవిష్యత్తులో రాష్ట్రానికి బీసీ సీఎం కావడం ఖాయమని, అదికూడా కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని, ఒకవేళ వచ్చినా అవి సాయంత్రానికి సర్దుకుపోయాయని చెప్పారు. కాంగ్రెస్ లో లీడర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ జిల్లా నుంచే పోటీ చేస్తానని చెప్పారు. బీసీ మంత్రిగా కొండా సురేఖను తొలగించినప్పుడు బాధపడ్డానని, హద్దులు దాటితే ఎవరిపైనా చర్యలు ఉంటాయని ఈ ఘటనతో హైకమాండ్ హెచ్చరించిందన్నారు.
కేసీఆర్ ఫెయిల్యూర్ సీఎం
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ను గౌరవిస్తానని, కాని సీఎంగా కేసీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అని మహేశ్ గౌడ్అన్నారు. ఏఐ టెక్నాలజీతో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలు ఎక్కువకాలం కొనసాగయన్నారు. ఫోర్త్ సిటీపై హరీశ్‌రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, మూసీ లక్ష కోట్ల ప్రాజెక్టు అంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, హైడ్రాపై చేసిన ప్రచారాన్నే మూసీపై చేస్తుందని మండిపడ్డారు. 22ఏ ద్వారా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
22ఏ లో ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తిది తప్పుకాదని, భూమి నిషేధిత జాబితాలో ఉందని తెలిసీ వెంచర్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం అసెంబ్లీలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా బీసీని నియమించని బీజేపీ సీఎంగా బీసీని చేస్తామంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. రెండేళ్ల పదవి కాలం పూర్తయిన సందర్భంగా మహేశ్ గౌడ్ ను అభినందించేందుకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో గాంధీ భవన్ సందడిగా మారింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మహేశ్ గౌడ్‌కు శాలువా కప్పి అభినందనలు చెప్పారు. మహిళా కాంగ్రెస్ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో మహేశ్ గౌడ్ కేక్ కట్ చేసి మహిళా కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు.
