మూడేళ్ల క్రితం ఈ పాత్ర వస్తే..  ఆ తప్పులు జరిగేవి కావు: సంపూర్ణేష్‌‌ బాబు..

మూడేళ్ల క్రితం ఈ పాత్ర వస్తే..  ఆ తప్పులు జరిగేవి కావు: సంపూర్ణేష్‌‌ బాబు..

కామెడీ హీరోగా, కమెడియన్‌‌గా తనకంటూ ఓ ప్రత్యేక  గుర్తింపును అందుకున్న సంపూర్ణేష్‌‌ బాబు.. ఇప్పుడు పూర్తిస్థాయి సీరియస్‌‌ క్యారెక్టర్‌‌‌‌తో సర్‌‌‌‌ప్రైజ్ చేయబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్‌‌’ చిత్రంలో హీరో నానికి స్నేహితుడిగా ‘బిర్యానీ’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.  సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం  సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది.  ఈ సందర్భంగా సంపూర్ణేష్‌‌ బాబు ఇలా ముచ్చటించాడు.  

‘‘డైరెక్టర్‌‌‌‌ శ్రీకాంత్ గారి నుంచి కాల్ వస్తే వెళ్లి కలిశా.  ‘ది ప్యారడైజ్‌‌’ సినిమా గురించి,  అందులోని బిర్యానీ క్యారెక్టర్‌‌‌‌ గురించి చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్‌‌‌‌ చేయలేదు. నాని గారికి బెస్ట్ ఫ్రెండ్‌‌గా ఫుల్‌‌ సీరియస్‌‌గా ఉండే క్యారెక్టర్‌‌‌‌.  సినిమా అంతా కనిపిస్తాను.  గతంలో నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మూడేళ్ల క్రితం ఇలాంటి క్యారెక్టర్‌‌‌‌ వచ్చి ఉంటే నా కెరీర్‌‌‌‌లో జరిగిన కొన్ని మిస్టేక్స్‌‌ జరిగేవి కావు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యేవరకు మరో సినిమా చేయకూడదని ఫిక్స్‌‌ అయ్యా. కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా.  ఈ పాత్ర కోసం డైరెక్టర్ ఏంచెప్తే అది ఫాలో అయ్యా. బరువు తగ్గడంతో పాటు జుట్టు, గడ్డం పెంచా.  

నాపై దర్శకనిర్మాతలు ఉంచిన  నమ్మకాన్ని నిలబెట్టాలని నా వంతు కృషి చేశా. షూటింగ్‌‌లో నాని గారు నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు.  ఇన్నేసి రోజులు ఓ సినిమాకు పనిచేయడం నాకిదే ఫస్ట్ టైమ్. నా కెరీర్‌‌‌‌లో ఎక్కువ రెమ్యూనరేషన్‌‌ అందుకున్నది కూడా ఈ సినిమాకే.  నిర్మాత సుధాకర్ గారు  చాలా గ్రాండ్ గా నిర్మించారు. ప్యారడైజ్ బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో ఈ సినిమా అంత అద్భుతంగా ఉంటుంది. అంతకంటే అద్భుతంగా నేను పోషించిన పాత్ర ఉంటుంది. అది ఎలా అనేది థియేటర్స్‌‌లోనే చూడాలి.  నా పాత్ర మాత్రమే కాదు సినిమాలోని అన్ని  క్యారెక్టర్స్‌ కు ఇంపార్టెన్స్‌‌ ఉంటుంది.  యాక్షన్‌‌, ఎమోషన్స్‌‌ అద్భుతంగా ఉంటాయి.  ఓ నటుడిగా  నాని గారి డెడికేషన్‌‌ అద్భుతం. ఇక గతంలో మోహన్ బాబు గారి బ్యానర్‌‌‌‌లో పనిచేసిన నేను, ఆయనతో కలిసి నటించాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది’’.