యాదగిరిగుట్టలో వైభవంగా ‘స్వాతి’ వేడుకలు...గిరిప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అయిలయ్య

యాదగిరిగుట్టలో వైభవంగా ‘స్వాతి’ వేడుకలు...గిరిప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. 

ఉదయం ప్రధానాలయ ముఖ మంటపంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి శాస్త్రోక్తంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దంపతులు పాల్గొన్నారు. 

కొండకింద ఉన్న వైకుంఠ ద్వారం వద్ద ఆలయ ఈవో భవానీ శంకర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణ ప్రారంభించారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్సాహంగా అడుగులు వేస్తూ నరసింహ నామస్మరణతో గిరిప్రదక్షిణ పూర్తి చేశారు. గిరిప్రదక్షిణ అనంతరం విప్ బీర్ల అయిలయ్య భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.