- హుస్సేన్ సాగర్ తీరాన వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు
- జీహెచ్‌ఎంసీ, పోలీస్ కమిషనర్ పేరిట హెచ్చరిక
- హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలన్న ఆఫీసర్లు
- బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని సూచన
- అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్యాంక్ బండ్‌పై ఈసారి గణేశ్విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదివరకు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సాగరతీరాన హెచ్చరిక ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. భక్తులకు సమాచారం అందించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పేరిట ఈ ఫ్లెక్సీలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణ, నిమజ్జన టైంలో ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా చూడాలన్న కోర్టు మార్గదర్శకాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనానికి బదులుగా నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బేబీ పాండ్లు, హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. రూల్స్ఉల్లంఘించి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలను తరలించకుండా సీసీ కెమెరాలు, చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
