వ్యాపారులకు వచ్చే యూపీఐ చెల్లింపులపై మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఛార్జీల విధానం రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే స్ట్రీట్ వెండార్లను వణికిస్తోంది. రూ.15కి టీ అమ్ముకునే కొట్టు నుంచి పండ్లు, కూరగాయలు, పాల వాళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరినీ ఎండీఆర్ ఛార్జీల భారం షాక్ కి గురిచేస్తోంది. సంపాదించే పదోపరకో పై ఛార్జీలు పోతే తమ పరిస్థితి ఏంటని వారు అంటున్నారు.
చిన్న చిన్న బిజినెస్ లు చేసుకునే చాలా మందికి యూపీఐ చెల్లింపుల వల్ల ఇబ్బందుల గురించి అవగాహన కూడా చాలా తక్కువే. ఉదాహరణకు.. ఒక కూరగాయల షాపు ఓనర్ రోజుకు రూ.5వేలు దందా చేసినా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే సెటిల్మెంట్ సమయంలో దాని నుంచి ఛార్జీలను తగ్గించి సెటిల్ చేస్తుంటాయి. అంటే ప్రతి వెయ్యి రూపాయల యూపీఐ చెల్లింపులపై రూ.4 చొప్పున కట్ అయ్యి అకౌంట్లో రూ.4వేల 980 మాత్రమే జమ అవుతాయి. అరే డబ్బులు ఎందుకు కట్ అయ్యాయనే విషయం కూడా చాలా మంది వ్యాపారులకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇక్కడ చిన్న వ్యాపారులకు ఉన్న ఒక చిన్న వెసులుబాటు ఏంటంటే నెలకు రూ.లక్ష లోపు పేమెంట్స్ వస్తే మాత్రం వారిపై ఎలాంటి ఛార్జీలు ఉండబోవు. పరిధి దాటితే బాదులు తప్పదు.
ALSO READ : UPI ఎండీఆర్ అంటే ఏంటి.? నిత్యవసర రంగాలు,సేవలపై ఎంత చార్జీ వసూలు
సరేలే ఈ ఛార్జీల గోల మనకు దేనికని పూర్తిగా యూపీఐ పేమెంట్స్ ఆపేయటం కూడా వారి బిజనెస్ ను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు కూరగాయలు, పాలు, పండ్లు, కిరాణా షాపు ఓనర్లు యూపీఐ పేమెంట్లను నిలిపివేసి క్యాష్ కావాలని కస్టమర్లకు చెబితే క్రెడిట్ కార్డులు, అప్పులు, బైనౌ పే లేటర్ యాప్స్ వాడే చాలా మంది దగ్గరలోని సూపర్ మార్కెట్లు, డీమార్టులు, క్విక్ కామర్స్ యాప్స్ కి మళ్లే ప్రమాదం కూడా ఉంటుందని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. మెుత్తానికి డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల భారం చిన్న వ్యాపారుల జీవితాలను ఆందోళనకు గురిచేస్తోంది.
