ఓటుకు నోటు కేసు చెల్లదు .. 2015 చట్టాల ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదు

ఓటుకు నోటు కేసు చెల్లదు .. 2015 చట్టాల ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదు
  • రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు
  •  సుప్రీంలో సీఎం తరఫున సిద్దార్థ లూత్రా వాదనలు 

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిపై దాఖలైన ‘ఓటుకు నోటు’ కేసు ఏసీబీ యాక్ట్​ ప్రకారం చెల్లుబాటుకాదని సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో వాదించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కోణంలో సాగిందని, ముందుగా రేవంత్‌‌‌‌రెడ్డిని ట్రాప్‌‌‌‌ చేసిన తర్వాతే ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేసిందన్నారు. కేసును ఏసీబీ కింద కాకుండా ఎన్నికల చట్టాల నిబంధనల ప్రకారం విచారించాలని కోరుతూ 2021 జులై 22న రేవంత్‌‌‌‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో తన పేరును తొలగించాలని 2021 ఏప్రిల్‌‌‌‌ 13న సండ్ర వెంకట వీరయ్య కూడా పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై బుధవారం సీజేఐ జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ జోయ్‌‌‌‌మాల్య బాగ్చీ, జస్టిస్‌‌‌‌ వి.మోహన ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తరఫున సీనియర్‌‌‌‌ అడ్వొకేట్లు సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్‌‌‌‌, సండ్ర వెంకట వీరయ్య తరఫున సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ నాగముత్తు, తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, రాష్ట్ర స్టాండింగ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌, ప్రతివాదుల తరఫున సీనియర్‌‌‌‌ అడ్వొకేట్లు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి, ఏఓఆర్‌‌‌‌ మోహిత్‌‌‌‌రావు తదితరులు హాజరయ్యారు. 

రాజకీయ కోణంలో కేసు: లూత్రా

ఓటుకు నోటు కేసు రాజకీయ కోణంతో ముడిపడి ఉందని లూత్రా సీజేఐ దృష్టికి తెచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేయలేదని, రేవంత్‌‌‌‌రెడ్డిని ట్రాప్‌‌‌‌ చేసి.. ఆ తర్వాత ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేశారని వాదించారు. సీఆర్‌‌‌‌పీసీ కింద ఎలాంటి దర్యాప్తు ప్రారంభించలేదని, ఈ ప్రక్రియ పూర్తిగా చట్టవిరుద్ధమని వాదించారు. ఏసీబీ యాక్ట్​–1988లోని సెక్షన్‌‌‌‌ 12 కింద రేవంత్‌‌‌‌రెడ్డిపై కేసు నమోదు చేశారని లూత్రా తెలిపారు. సెక్షన్లు 7, 11 కింద లంచం తీసుకోవడమే నేరమని, లంచం ఇవ్వడం నేరం కాదని వాదించారు.

ఈ  సెక్షన్లు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు.మండలి ఎన్నికల్లో ఓటు వేయడం,  వేయకపోవడం ఏసీబీ పరిధిలోకి రాదని తెలిపారు. ప్రతివాదుల తరఫు సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ ఆర్యమ సుందరం అనారోగ్యంతో హాజరుకాకపోవడంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. తదుపరి తేదీని కోర్టు మాస్టర్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేస్తారని సీజేఐ స్పష్టం చేశారు. ఈ నెల 30న మరోసారి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని విచారణ జాబితాలో సుప్రీంకోర్టు పేర్కొంది.