వైద్యం చేయకున్నా నెలనెలా రూ.70 వేల జీతం..కర్నాటకలో ఎమ్మెల్యే మేనకోడలి నిర్వాకం

వైద్యం చేయకున్నా నెలనెలా రూ.70 వేల జీతం..కర్నాటకలో ఎమ్మెల్యే మేనకోడలి నిర్వాకం

బెంగళూరు: కర్నాటకలో ఓ డాక్టర్‌‌‌‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేష్​ మేతి మేనకోడలు ప్రభుత్వ నమ్మా క్లినిక్‌‌లో విధులు నిర్వర్తించకుండనే నెలకు రూ.70 వేల జీతం తీసుకుంటూ... ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్నట్టు అధికారులు గుర్తించారు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనధికారికంగా ఒకేసారి రెండు చోట్ల కొనసాగడంపై ఆమెపై విచారణకు ఆదేశించారు.

బాగల్‌‌కోట్‌‌లోని ప్రభుత్వ నమ్మా క్లినిక్‌‌లో డాక్టర్ అంకిత యారగల్ డాక్టర్‌‌‌‌గా నియమితులయ్యారు.  అయితే, ఆమె క్లినిక్‌‌కు అసలు వెళ్లకుండానే, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎండీ కోర్సులో చేరి స్టూడెంట్‌‌గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆమెకు నెలకు సుమారు రూ.70 వేల వరకు జీతం చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి.

తాలూకా ఆరోగ్య అధికారి ఆ క్లినిక్‌‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన సమయంలో అంకిత విధులకు గైర్హాజరు కావడంతో  ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాగల్‌‌కోట్ జిల్లా పంచాయతీ  సీఈవో గజానన్ బాలే అంకితకు షోకాజ్ నోటీసులిచ్చారు. బుధవారం తొలి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, ఆమె గైర్హాజరు కావడంతో, సెప్టెంబర్ 18న తగిన పత్రాలతో విచారణకు హాజరుకావాలని కోరారు.