ఇండియాలోనే ఐపీఎల్‌‌ వేలం!

ఇండియాలోనే ఐపీఎల్‌‌  వేలం!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌–2027 సీజన్‌‌ వేలం ఇండియాలోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు లీగ్ చైర్మన్‌‌ అరుణ్‌‌ ధుమాల్‌‌ స్పష్టం చేశాడు. గత మూడేళ్లుగా దుబాయ్‌‌, జెడ్డా, అబుదాబిలో వేలం నిర్వహించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘పెళ్లిళ్ల సీజన్‌‌ కారణంగా మాకు సరైన వేదికలు లభించకపోవడంతో గతంలో విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది మినీ వేలం ఉంటుంది. కాబట్టి దీనికి తగిన వేదిక దొరుకుతుందని భావిస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తాం’ అని ధుమాల్‌‌ పేర్కొన్నాడు.

గురువారం జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐపీఎల్‌‌ చైర్మన్‌‌గా ధుమాల్‌‌ను తిరిగి నియమించనున్నారు. ఇక ఐపీఎల్‌‌లో ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ నిబంధనపై కూడా పునఃసమీక్ష జరపనున్నారు. రోహిత్‌‌ శర్మ, హార్దిక్‌‌ పాండ్యా, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌లాంటి స్టార్‌‌ ప్లేయర్లు ఈ రూల్‌‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్‌‌రౌండర్ల పాత్రను ఈ నిబంధన నీరుగారుస్తోందని అభిప్రాయపడ్డారు. దీనిపై భాగస్వాములందరి అభిప్రాయాలు సేకరించి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ధుమాల్‌‌ తెలిపాడు. 

జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్‌‌

విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌) ఐదో సీజన్‌‌ షెడ్యూల్‌‌కు బీసీసీఐ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు టోర్నీ జరగనుంది. అయితే మ్యాచ్‌‌ల వేదికలను ఇంకా ఖరారు చేయలేదు. అక్టోబర్‌‌ 28న కొచ్చిలో డబ్ల్యూపీఎల్‌‌ ప్లేయర్ల వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ నెల 28లోగా ఐదు ఫ్రాంచైజీలు తమ రిటేన్‌‌ జాబితాను లీగ్‌‌ నిర్వాహకులకు అందించాల్సి ఉంటుంది.