- రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ ను అభివృద్ధి చేస్తాం
- పక్కా ప్రణాళికతో నిమజ్జనం నిర్వహిస్తాం
కరీంనగర్/కొత్తపల్లి, వెలుగు: రూ.16 కోట్ల స్వచ్ఛ భారత్ స్కీం నిధులతో చేపట్టనున్న డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. డంపింగ్ యార్డ్ పనులను స్పీడప్ చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మరో రూ.80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. బుధవారం కరీంనగర్లో పలుచోట్ల సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూఐడీఎఫ్ స్కీంలో భాగంగా రూ.50 కోట్లతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, డ్రెయిన్ అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల కోసం రూ.1.5 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులు గతేడాదితో మూడింతలు ఎక్కువన్నారు. నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా 3 రోజుల ముందే నీళ్లను విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మానకొండూర్, కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం, మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిలతో కలిసి సమీక్షించారు.
