న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను పునర్వ్యవస్థీకరించింది. మొత్తం 18 మంది సభ్యులతో కొత్త బోర్డును కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం నియమించింది. కొత్త బోర్డు తక్షణమే అమల్లోకి రానుంది. ఈ నియామకాలు మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని పేర్కొంది.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డకు సీబీఎఫ్‌సీ కొత్త బోర్డులో సభ్యురాలిగా అవకాశం లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో అనుబంధం ఉన్న సుప్రియా యార్లగడ్డ తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, నటిగా పనిచేశారు. కొత్త బోర్డుకు ప్రస్తుతం శశి శేఖర్ వెంపటి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
సినీ పరిశ్రమతో పాటు సంగీతం, సాహిత్యం, రంగస్థలం, కళలు తదితర రంగాల ప్రముఖులకు కొత్త బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా, నటులు పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, మనోజ్ జోషి, డైరెక్టర్ ప్రియదర్శన్, గాయకుడు హన్స్‌రాజ్ హన్స్, ప్రొసెన్‌జిత్ ఛటర్జీ, నటి రూపాలి గంగూలీ, పల్లవి జోషి తదితరులకు బోర్డులో చోటు దక్కింది.
