ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ అనర్హతపిటిషన్లపై రేపు (సెప్టెంబర్ 18న) తీర్పు

 ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ అనర్హతపిటిషన్లపై రేపు (సెప్టెంబర్ 18న) తీర్పు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఖైరతాబాద్‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు ఈనెల 18న వెలువరించనుంది. దానం నాగేందర్‌‌పై అనర్హత పిటిషన్లను స్పీకర్‌‌ తిరస్కరించడాన్ని సవాల్‌‌ చేస్తూ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌‌ కుమార్‌‌సింగ్‌‌, జస్టిస్‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసింది. తొలుత సెప్టెంబర్‌‌ 16న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, తీర్పు సిద్ధం కాకపోవడంతో 18కి వాయిదా వేసింది. బీఆర్‌‌ఎస్‌‌ టికెట్‌‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌‌ కాంగ్రెస్‌‌లో చేరడంతోపాటు,  సికింద్రాబాద్‌‌ లోక్‌‌సభ స్థానానికి పోటీ చేయడం అనర్హతకు దారితీస్తుందని పిటిషనర్లు వాదించారు. పార్టీ మారిన మరికొందరు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్‌‌ తిరస్కరించడాన్ని సవాల్‌‌ చేస్తూ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను అక్టోబర్‌‌ 6కు వాయిదా వేసింది.