- ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
అవసరమైన మొక్కలు, పరికరాలు 40 నుంచి 90 శాతం వరకు రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. 2026–-27లో ఉద్యాన పంటలకు రూ.150 కోట్లు, సూక్ష్మ సేద్యానికి రూ.243 కోట్లు, ఆయిల్‌పామ్‌కు రూ.261 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తుమ్మల చెప్పారు.
