సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తం : సింగపూర్ ప్రతినిధులు

సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తం : సింగపూర్ ప్రతినిధులు
  • పెట్టుబడికి ముందుకొచ్చిన సింగపూర్ ప్రతినిధులు  
  • అసెంబ్లీ ఛాంబర్‌‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌‌లో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు అభివృద్ధికి ఆర్థికంగా సహకరించాలని సీఎం కోరగా, సింగపూర్ బృందం సానుకూలంగా స్పందించింది.

ఇదే సమయంలో డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న 'తెలంగాణ గ్లోబల్ సమిట్'కు  సింగపూర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.   హైదరాబాద్‌‌ను కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌‌గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌‌ఫర్డ్, ఎంఐటీ,లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు తమ ఆఫ్ షోర్ క్యాంపస్‌‌లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని సీఎం  వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్ తదితరులు పాల్గొన్నారు.