వరంగల్ ఐటీఐకి పునరుజ్జీవం...యువతకు మరింత మెరుగవనున్న ఉపాధి అవకాశాలు

వరంగల్ ఐటీఐకి పునరుజ్జీవం...యువతకు మరింత మెరుగవనున్న ఉపాధి అవకాశాలు
  • కొత్తబిల్డింగ్ నిర్మాణానికి రూ.25 కోట్లు
  • పీఎం సేత ద్వారా రూ.40 కోట్లు మంజూరు
  • తొందర్లోనే మారిపోనున్న రూపురేఖలు

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ఎంతోమందికి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన వరంగల్ ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఎట్టకేలకు అభివృద్ధి బాట పట్టనుంది. దాదాపు ఆరున్నర దశాబ్ధాలుగా వేలాది మందిని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దుతున్న ఈ సంస్థ భవనం ఇన్నాళ్లూ తీవ్ర నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలోనే స్థానిక నేతల విజ్ఞప్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరయ్యాయి. 

రాష్ట్ర ప్రభుత్వం 'శక్తి' డిపార్ట్మెంట్, కేంద్రం 'పీఎం సేతు' కింద ఫండ్స్ సాంక్షన్ చేయడంతో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ స్థానంలో కొత్త భవనం, అత్యాధునిక ఎక్విప్మెంట్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే ములుగు రోడ్డు ప్రాంగణంలోనే మూడు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు నిర్మించారు. ఇప్పుడు ఐటీఐకి కొత్త బిల్డింగ్, అప్ గ్రేడెడ్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి రానుండటంతో నిరుద్యోగ యువత ఉపాధికి మరింత తోడ్పాటు అందే అవకాశం ఉంది.

1959లోనే నిర్మాణం.. 

నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వరంగల్ ములుగు రోడ్డులో 1959లో ప్రభుత్వ ఐటీఐ బిల్డింగ్ ను నిర్మించారు. దాదాపు 50 ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ భవనానికి ఇప్పటికే 67 ఏండ్లు పూర్తయ్యాయి. కాలక్రమేణా భవనం శిథిలమవుతూ వచ్చింది. కనీస రిపేర్లు చేయించకపోవడంతో బిల్డింగ్ గోడలు, కిటికీలు, క్లాస్ రూం దర్వాజలు దెబ్బతిన్నాయి. దీంతో విద్యార్థులు, స్టాఫ్ ప్రమాదకర బిల్డింగ్ లోనే శిక్షణ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి ఆఫీసర్లు సమస్యను గతంలోనే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు. 

రూ.25 కోట్లతో కొత్త బిల్డింగ్..

వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, డీజిల్ మెకానిక్, వెల్డర్, కోపా ట్రేడ్ లు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 620 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఏటా ఇంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరగా ప్రిన్సిపల్ చందర్ విజ్ఞప్తి మేరకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో 'డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి)' నుంచి ఇటీవలే రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఐటీఐ నిర్వహణకు జీ ప్లస్ వన్ బిల్డింగ్,  వాటర్ సప్లై, శానిటేషన్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. దీంతో  విద్యార్థులు, స్టాఫ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘పీఎం సేతు’తో మరింత డెవలప్మెంట్..

రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ఐటీఐకి కొత్త బిల్డింగ్ నిర్మించనుండగా, వరంగల్ ఎంపీ కడియం కావ్య చొరవతో ‘పీఎం సేతు’ (ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ ఫర్మేషన్ థ్రూ అప్ గ్రేడెడ్ ఐటీఐస్) లోనూ అవకాశం దక్కింది. పీఎం సేతు కింద వరంగల్ ఐటీఐకి రూ.40 కోట్లు శాంక్షన్ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా మూడు క్లస్టర్లు ఉండగా, అందులో హైదరాబాద్ ఓల్డ్ సిటీ హబ్ లో భాగంగా వికారాబాద్, పంజాగుట్ట, నల్గొండతో పాటు వరంగల్ ఐటీఐ స్పోక్స్ గా ఎంపిక చేశారు.

 ఇందులో ఓల్డ్ సిటీ హబ్ కు రూ.80 కోట్లు, మిగతా స్పోక్స్ ఐటీఐలకు రూ.40 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఈ మేరకు వరంగల్ ఐటీఐకి పీఎం సేతు కింద వచ్చే రూ.40 కోట్లతో మెషినరీ, ఎక్విప్మెంట్స్, ట్రేడ్ అప్ గ్రేడేషన్, వర్క్ షాప్ రినోవేషన్ తదితర పనులు చేపట్టనున్నారు. ఆయా పనులన్నీ పూర్తయితే తొందర్లోనే వరంగల్ ప్రభుత్వ ఐటీఐ రూపురేఖలు మారనున్నాయి. 

ఉపాధికి మరింత తోడ్పాటు..

వరంగల్ ఐటీఐ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఐటీఐ బిల్డింగ్ నిర్మాణ పనులు టెండర్ దశలో ఉండగా, పీఎం సేతు కింద మంజూరైన నిధులతో ఐటీఐలో అప్ గ్రేడెడ్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వస్తుంది. వీటితో ఐటీఐ రూపురేఖలు మారిపోతాయి. ఐటీఐల అప్ గ్రేడ్ తో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా దక్కే అవకాశం ఉంది.

- ఎం.చందర్,  ప్రిన్సిపల్, వరంగల్ ఐటీఐ-