- వితంతువుల పింఛన్ల కోసం 3.31 లక్షల అర్జీలు
- హైదరాబాద్‌లో అత్యధికంగా 46,540,
- ములుగులో తక్కువగా 4,818 దరఖాస్తులు
- మొదలైన క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల ఎంపిక
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘చేయూత’ పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, డేటా ఎంట్రీ గడువు ముగియడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తుది నివేదికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో మొత్తం 5,98,193 అప్లికేషన్లు వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ ముగియడంతో క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ దివ్య ఆదేశాలు జారీ చేశారు.
సగానికి పైగా వితంతువుల అర్జీలే..
కొత్త పింఛన్ల కోసం వచ్చిన అర్జీల్లో సగానికి పైగా వితంతువుల నుంచే రావడం గమనార్హం. చాలా కాలంగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన మహిళలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో వితంతువుల వాటానే 55 శాతానికి పైగా ఉండగా, ఆ తర్వాతి స్థానంలో దివ్యాంగులు ఉన్నారు. మొత్తం 5,98,193 అప్లికేషన్లలో వితంతువుల అర్జీలు 3,31,236 ఉండగా.. దివ్యాంగులు 1,48,882, ఒంటరి మహిళలు 62,689, గీత కార్మికులు 37,381, చేనేత కార్మికులు 18,005 మంది దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్ అత్యధికం, ములుగులో అత్యల్పం
పింఛన్ల దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాను 46,540 అప్లికేషన్లు రాగా.. ములుగు జిల్లా కేవలం 4,818 అర్జీలు మాత్రమే వచ్చాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 38,293, నల్గొండ 32,993, మేడ్చల్ -మల్కాజిగిరి 32,968, ఖమ్మం 27,772 జిల్లాల నుంచి అప్లికేషన్లు వచ్చాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పది వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కాగా, వెరిఫికేషన్ ప్రక్రియ స్పీడ్ గా పూర్తి చేయాలని, అర్హులందరికీ పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆఫీసర్లను ఆదేశించారు.
