సిలబస్, అర్హత మార్కులు, పరీక్షా విధానంపై సమీక్ష
న్యూఢిల్లీ, వెలుగు:టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) సిలబస్, అర్హత మార్కులు, పరీక్షా విధానాన్ని సమీక్షించి, అవసరమైన మార్పులను సూచించేందుకు ఉప సంఘం(సబ్ కమిటీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ పంకజ్ అరోరా వెల్లడించారు. టెట్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎన్‌సీటీఈ అధికారులు హామీ ఇచ్చినట్లు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) నాయకులు తెలిపారు.
బుధవారం ఢిల్లీలో ఎస్టీఎఫ్ఐ ప్రెసిడెంట్ సీఎన్ భారతి నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు కేఎస్ఎస్ ప్రసాద్, ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు ఎన్‌సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా, మెంబర్ సెక్రటరీ సుఖ్ గీత్ కౌర్, డిప్యూటీ సెక్రటరీ (అకడమిక్) సతీశ్ కుమార్ ఇతర అధికారులను కలిశారు. ఈ సందర్భంగా టెట్ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. డిప్యూటీ సెక్రటరీ సతీశ్ కుమార్‌తో జరిగిన సమావేశంలో టెట్ పరీక్షకు సంబంధించి టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులు వివరించారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న టీచర్లు నిర్ణీత గడువులోగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన నెలకొన్నదని తెలిపారు. 2028 ఆగస్టు 31లోగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన నిబంధన వల్ల ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లపై అదనపు ఒత్తిడి పడుతోందన్నారు. టెట్ సిలబస్‌ను శాస్త్రీయ ప్రాతిపదికన రూపొందించాలని, ఉపాధ్యాయుల బోధనా అనుభవం, వారు బోధించే సబ్జెక్టులకు అనుగుణంగా పరీక్షా విధానాన్ని రూపొందించాలని కోరారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని, ప్రస్తుతం ఉన్న అర్హత మార్కులను తగ్గించాలని ఎన్‌సీటీఈ అధికారులకు విజ్ఞప్తి చేశారు. టెట్ విషయంలో త్వరలోనే సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ప్రైమరీ స్కూల్ టీచర్లకూ ఎమ్మెల్సీ ఓటు..
రాష్ట్రంలో రానున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఎన్‌సీటీఈ అధికారులను కలిసిన తర్వాత వారు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వాచన్ సదన్‌కు వెళ్లారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించే అంశాన్ని పరిశీలించాలని వినతిపత్రాలు సమర్పించారు.
