- 19న కోదాడలో మెగా జాబ్ మేళా
- నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ..
- 20 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యే చాన్స్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ వేదికగా ఈ నెల 19న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, పరిశ్రమలు, ఐటీ, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై మేళాను ప్రారంభించనున్నారు.
జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా.. వేలాది మంది అభ్యర్థులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందులో కనీసం నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంపికైన క్యాండిడేట్లకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ ఉద్యోగాలు కల్పించనున్నారు. జాబ్ మేళాను సక్సెస్ చేసేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
300 కంపెనీలు.. 20 వేల మంది క్యాండిడేట్లు
కోదాడలో నిర్వహించే జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్, హెల్త్ కేర్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాలకు చెందిన అపోలో, జీఎంఆర్, రాంకీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సుమారు 300 కంపెనీలు పాల్గొనున్నాయి. ఆయా కంపెనీలకు చెందిన హెచ్ ఆర్ ప్రతినిధులు హాజరై క్యాండిడేట్లకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఈ మేళాకు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి సుమారు 20 వేల మందికి పైగా నిరుద్యోగులు హాజరవుతారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. జాబ్‌మేళా గురించి ఇప్పటికే సుమారు లక్షన్నర మందికి సందేశాలు పంపించగా.. ఎంప్లాయ్ మెంట్ శాఖలో నమోదైన 27వేల మంది నిరుద్యోగులు సైతం జాబ్ మేళాకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు.
మేళాకు హాజరుకావాలనుకునే నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. క్యాండిడేట్లు మొదట kodadajobmela.com లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ ను జాబ్ మేళా వద్ద స్కాన్ చేస్తే క్యాండిడేట్ల వివరాలు ఆటోమేటిక్ గా హెల్ప్ డెస్క్ లో కనిపించనున్నాయి.
ఒక్కో క్యాండిడేట్ ఐదు కంపెనీల ఇంటర్వూలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. అభ్యర్థుల అర్హతల వారీగా ప్రత్యేక బ్లాకులు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. జాబ్ మేళా నిర్వహణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు.
కార్యక్రమ పర్యవేక్షణకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నాయకత్వంలో ఆర్గనైజింగ్ కమిటీని, అలాగే మీడియా, సోషల్ మీడియా, పార్కింగ్ మరియు కేటరింగ్ కమిటీలను నియమించారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూచించారు.
