సుజాతనగర్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 12 సబ్‌సెంటర్ల పరిధిలో 12,759 కుటుంబాలు, సుమారు 45,755 మంది జనాభా ఉండగా, చుంచుపల్లి, జూలూరుపాడు మండలాల పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ కేంద్రాన్నే ఆశ్రయిస్తున్నారు.
రోజుకు 80 నుంచి 130 వరకు ఓపీ నమోదవుతున్నా, అందుకు సరిపడా వైద్య సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్‌సీలో కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉండటంతో ఇన్‌పేషెంట్ సేవలు పరిమితమయ్యాయి. అత్యవసర సమయాల్లో బెడ్‌లు అందుబాటులో లేక రోగులను జిల్లా కేంద్రానికి తరలించాల్సి వస్తోంది. పెరుగుతున్న జనాభా, ఓపీకి అనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచడంతో పాటు రెగ్యులర్ వైద్య సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
