హరీశ్ కుటుంబానికి 30.5, కవిత ఫ్యామిలీకి 37.26 ఎకరాలు:సీఎం రేవంత్ రెడ్డి

హరీశ్ కుటుంబానికి 30.5, కవిత ఫ్యామిలీకి 37.26 ఎకరాలు:సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌ కుటుంబంతోపాటు వారి ఫ్యామిలీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా భూదోపిడీ సాగిందని సీఎం రేవంత్​ ఎండగట్టారు. మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు, ఆయన భార్య తన్నీరు శ్రీనిత పేర్లపై చిన్నకోడూరు, మహేశ్వరం, సిద్దిపేట, మొయినాబాద్‌‌‌‌లలో కలిపి 30.5 ఎకరాలు ఉన్నాయని, ఇందులో హరీశ్‌‌‌‌ పేరిట 21 ఎకరాలు, శ్రీనిత పేరిట 8.5 ఎకరాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, కేసీఆర్‌‌‌‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరిట మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో 14 ఎకరాలు, ఆమె భర్త  డీఆర్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ పేరిట 23 ఎకరాలు కలిపి 37.26 ఎకరాల భూమి నమోదై ఉందని వివరించారు. ఇక కేసీఆర్‌‌‌‌కు మందులు ఇస్తుంటానని స్వయంగా రాజ్యసభ సీటు ఇప్పించుకున్న జోగినపల్లి సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌ కుటుంబం భూబాగోతం మరింత విస్మయం కలిగిస్తోందని  సీఎం చెప్పారు.
 
సంతోష్‌‌ తండ్రి జోగినపల్లి రవీందర్‌‌‌‌రావు పేరిట ఎర్రవల్లి, కేశంపేట, మార్కూక్, నరసింహాపూర్, పెద్దూర్, తడగొండ, వేములవాడలో 53.16 ఎకరాలు, సంతోష్‌‌ కుమార్‌‌ పేరిట మార్కూక్, పెద్దేముల్, ఎర్రవల్లి, తోటపల్లిలో 18.21 ఎకరాలు, ఆయన భార్య రోహిణి పేరిట రంగారెడ్డి జిల్లాలో 7.23 ఎకరాలు కలిపి ఈ ఒక్క కుటుంబానికే 79.20 ఎకరాల భూమి ఉందని వివరించారు. వీరికి తోడు బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీ నవీన్‌‌రావు పేరిట 52.16 ఎకరాలు, ఆయన సోదరుడు కొండల్‌‌రావు పేరిట 48.38 ఎకరాలు ఉన్నాయని, ఇలా కేసీఆర్‌‌ ఉమ్మడి కుటుంబం తొమ్మిది జిల్లాల్లోని 24 మండలాల పరిధిలో గల 31 గ్రామాల్లో ఏకంగా 440 ఎకరాల భూములను అధికార బలంతో సొంతం చేసుకుందని వెల్లడించారు.

గండిగుండెంలో 122 ఎకరాల ప్రైవేట్​భూమి స్వాహా

ధరణి పోర్టల్‌‌ను ఆసరాగా చేసుకొని మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా బాలానగర్‌‌ మండలం గండిగుండెం గ్రామంలో 122 ఎకరాల విలువైన ప్రైవేటు భూమిని హరీశ్‌‌రావు కుటుంబం హస్తగతం చేసుకున్నదని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్‌‌లో భూయజమానుల పేర్లలో ఏవైనా సాధారణ అక్షర దోషాలు ఉంటే సరిదిద్దడానికి ఉద్దేశించిన ‘టీఎం-33’ (ట్రాన్సాక్షన్‌‌ మాడ్యూల్‌‌)ను ఇందుకోసం దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. గండిగుండెం పరిధిలో గౌరవ్‌‌ ఖురానా అనే మార్వాడీకి చెందిన 93 ఎకరాల 33 గుంటల భూమి రికార్డుల్లో ఉండగా, ఎలాంటి సేల్‌‌ డీడ్, గిఫ్ట్‌‌ డీడ్, రిజిస్ట్రేషన్‌‌ ఫీజులు లేకుండా కేవలం నేమ్‌‌ కరెక్షన్‌‌ దరఖాస్తు ద్వారా హరీశ్‌‌రావు మామ ఎం.హనుమంతరావు పేరిట మార్చేశారని తెలిపారు. 

అక్కడి నుంచి ‘రాజ్‌‌ హైటెక్‌‌ ఫామ్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌’ అనే సంస్థకు ఈ భూమిని బదిలీ చేశారని, ఈ కంపెనీలో హరీశ్‌‌రావు సొంత సోదరుడు తన్నీరు మహేశ్‌‌రావు, మామ హనుమంతరావు డైరెక్టర్లుగా ఉన్నారని పత్రాలు చూపించారు. అలాగే, మానవిహార్‌‌ బ్రీడర్స్‌‌ పేరుతో మరో 26 ఎకరాల భూమిని కూడా ఈ ఇద్దరి భాగస్వామ్యంతోనే లాక్కున్నారని, మొత్తంగా 120 ఎకరాల 8 గుంటల భూమిని రెవెన్యూ రికార్డులే లేకుండా కొల్లగొట్టారని ఆరోపించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని నిర్బంధించి భయపెట్టారని, సమాజంలో ఏ ఒక్క సామాన్య పౌరుడికీ జరగని ఇలాంటి అక్రమ బదిలీలు కేవలం మంత్రుల బంధువులకే ఎలా సాధ్యమయ్యాయని సీఎం ప్రశ్నించారు.