డిజిటల్ ఇండియా నినాదం: బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు..సామాన్యుల నడ్డి విరిచేలా యూపీఐ ఛార్జీల భారం

డిజిటల్ ఇండియా నినాదం: బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు..సామాన్యుల నడ్డి విరిచేలా యూపీఐ ఛార్జీల భారం

హనుమకొండ, వెలుగు: దేశంలో డిజిటల్ ఇండియా నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సామాన్య ప్రజలు, చిరువ్యాపారుల నడ్డి విరిచేలా యూపీఐ లావాదేవీలపై ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం హనుమకొండ కాళోజీ సెంటర్ లో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొన్నేండ్లుగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం, తాజాగా రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలుకు ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూపీఐని ఉచితంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

లేదంటే ప్రజలందరినీ సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.