ప్రజాస్వామ్యాన్ని చంపేసినందుకు హ్యాపీ బర్త్‌డే మోడీ జీ: ఢిల్లీ ఓట్ల గల్లంతుపై కేజ్రీవాల్ ట్వీట్!

ప్రజాస్వామ్యాన్ని చంపేసినందుకు హ్యాపీ బర్త్‌డే మోడీ జీ: ఢిల్లీ ఓట్ల గల్లంతుపై కేజ్రీవాల్ ట్వీట్!

ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న SIR ముసాయిదా జాబితా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహించిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల తొలగింపు ప్రక్రియ విస్మయానికి గురిచేస్తోంది. 2025 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు అంటే డిసెంబర్, జనవరి నెలల్లో కొత్తగా చేర్చిన ఓట్లను లక్ష్యంగా చేసుకుని SIR డ్రాఫ్ట్‌లో భారీగా ఓట్లు తొలగించడం రాజకీయ దుమారానికి దారితీసింది.

భారీగా ఓట్ల తొలగింపు.. కేజ్రీవాల్ ఆగ్రహం:
న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2025 ఎన్నికల సమయంలో లక్షా 8వేల 788 మంది ఓటర్లు ఉండగా.. తాజా SIR సర్వే ఏకంగా 37వేల315 మంది పేర్లను తొలగించింది. అంటే ఇది దాదాపు 34.3 శాతం డిలీషన్ రేటు ఉంది. ఎన్నికల ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే మొత్తం 62వేల500 మంది ఓటర్లను ఈ నియోజకవర్గం కోల్పోయింది. కేవలం న్యూఢిల్లీలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని లెక్కలు బయటపెట్టాయి. ఫిబ్రవరి 2025లో కోటి 56లక్షలుగా ఉన్న ఢిల్లీ ఓటర్ల సంఖ్య.. ఆగస్ట్ 2026 నాటికి 97లక్షల 50వేలకు పడిపోయింది. ఈ భారీ ఓట్ల అక్రమాలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ, బీజేపీ కలిసి ఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామనే కక్షతో కేవలం కొద్ది నెలల్లోనే లక్షలాది మంది సామాన్య ప్రజల ఓట్లను గల్లంతు చేసి, ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈ కుట్రకు తెరలేపారఅని కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఢిల్లీ గద్దెకోసమే మోడీ కుట్ర..
2025 అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ చేతిలో బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఓటమికి ప్రతీకారంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ పథకం ప్రకారమే ఎన్నికల యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఆప్ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీశారనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు చెందిన విద్యార్థులు, పిల్లంజి గ్రామంలోని రోజువారీ కూలీలు, సాధారణ ప్రజల ఓట్లను ఎలాంటి సరైన సమాచారం లేకుండానే శాశ్వతంగా వెళ్లిపోయారంటూ తొలగించడం అధికారుల నిరంకుశ వైఖరికి అద్దం పడుతోంది.

డెమోక్రసీని చంపేశారు: 
ఓటర్లను తొలగించటం ద్వారానే మోడీజీ ఢిల్లీని గెలిచారని కేజ్రీవాల్ వెల్లడించారు. ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. భారతీయ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినందుకు మోడీజీకి అభినందనలు అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో నేరుగా గెలవలేక ఇలా కుట్రపూరితంగా లక్షలాది మంది సామాన్య ప్రజల ఓట్లను గల్లంతు చేసి, ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఇందుకోసం ఎస్ఐఆర్ డ్రాఫ్ట్‌ను అస్త్రంగా వాడారని ధ్వజమెత్తారు.

ALSO READ : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

రాజకీయ కక్షసాధింపు..
వలసదారులు, సామాన్య ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలనే టార్గెట్ చేసి ఈ ఓట్ల కోత కొనసాగింది. బూత్ స్థాయి అధికారులు సక్రమంగా ఇంటింటి సర్వే చేయకుండానే ఏకపక్షంగా పేర్లను తొలగించడం భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమే అవుతుంది. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాలరాసే ఈ తరహా రాజకీయ కక్షసాధింపు చర్యలు దేశ భవిష్యత్తుకే ముప్పుగా పరిణమిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపెట్టుకుని, ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.