ప్రముఖ స్పోర్ట్స్ వేర్ కంపెనీ అడిడాస్ ఇండియాలో తమ ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. గురుగ్రామ్‌లోని తన గ్లోబల్ టెక్ హబ్ కేంద్రంగా భారీ ఎత్తున లేఆఫ్స్ ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపించింది. కార్పొరేట్ వ్యాపార వ్యూహాల్లో మార్పులు, మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా తమ ఆపరేటింగ్ మోడల్‌ను సరిదిద్దుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కోతలతో గురుగ్రామ్ టెక్ కేంద్రంలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 350 మంది ఎఫెక్ట్ అయ్యారు.
సెప్టెంబర్ 15న నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో యాజమాన్యం ఈ షాకింగ్ వార్తను ఉద్యోగులకు అధికారికంగా తెలియజేసింది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 700 మంది ఉద్యోగులలో దాదాపు 350 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు తాజా లేఆఫ్స్ వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యారు. అడిడాస్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ టెక్కీలపై కంపెనీ నిర్ణయం పిడుగులా పడింది.
ఎఫెక్ట్ అయిన ఉద్యోగులను కంపెనీ రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది. మొదటి గ్రూప్‌నకు చెందిన ఉద్యోగులకు సమావేశం జరిగిన రోజే అంటే సెప్టెంబర్ 15నే నేరుగా ఎగ్జిట్ లెటర్స్ అందజేశారు. ఇక రెండో గ్రూప్ ఉద్యోగులను మాత్రం డిసెంబర్ వరకు కంపెనీలోనే కొనసాగాలని ఆదేశించారు. ఇతర గ్లోబల్ టెక్ హబ్స్‌లోని సహోద్యోగులకు ప్రాజెక్ట్ బాధ్యతలు, హ్యాండోవర్స్ పూర్తి చేయడానికి వీరిని డిసెంబర్ 15 వరకు ఉంచుకుంటున్నట్లు చెప్పింది.
డిసెంబర్ 15లోగా వేరే రోల్స్ వెతుక్కోవాలని, లేదా డిసెంబర్ 15 నాటికి కంపెనీలోనే వేరే జాబ్ రోల్ పొందలేని వారికి అదే చివరి వర్కింగ్ డే అవుతుందని స్పష్టం చేసింది అడిడాస్. అయితే తొలగించబడిన ఉద్యోగులకు అందజేసే సెవెరెన్స్ ప్యాకేజీ, నోటీసు పే వంటి అంశాలపై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై స్పందించిన అడిడాస్.. మారుతున్న బిజినెస్ అవసరాలకు తగినట్లు తమ ఆపరేటింగ్ విధానాన్ని చేంజ్ చేసేందుకే ఈ కఠిన నిర్ణయం అంటోంది. మెుత్తానికి ఏఐ ఎఫెక్ట్ ఈ ఉద్యోగుల ఉసురు తీసినట్లు కనిపిస్తోంది.
2021లో ప్రారంభమైన గురుగ్రామ్ టెక్ హబ్.. అడిడాస్ ఉత్పత్తులకు అవసరమైన టాప్ టెక్, ఇంజనీరింగ్ ప్రతిభను అభివృద్ధి చేయడంలో కీలకంగా నిలిచింది. భారత్ మార్కెట్ తమకు ఎంతో వ్యూహాత్మకమైనదని అడిడాస్ పేర్కొంటున్నప్పటికీ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా నిపుణులపై జరిగిన ఈ భారీ లేఆఫ్స్ దేశవ్యాప్తంగా టెక్ ఉద్యోగులను అలర్ట్ చేయటంతో పాటు ఆందోళనకు గురిచేస్తోంది.
