మెదక్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. 2026 సెప్టెంబర్ 17న వేడుకలకు హాజరైన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.. జాతీయ జెండా ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైన రోజు అని ఈ సందర్భంగా చెప్పారు.
తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి కృషి చేసిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు , స్వాతంత్ర్య సమరయోధులందరికీ జోహార్లు చెప్పారు మంత్రి. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని.. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజా పాలన మొదలై నేటికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభసందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారని.. ఆనాటి త్యాగాల ఫలితమే తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని అన్నారు. దేశమంతా 1947 ఆగస్ట్15 సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, కన్నడ భాషల మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేదన్నారు. హైదరాబా సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది అని నిజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారని గుర్తు చేశారు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన శ్రీ దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందన్నారు. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైన చాకలి ఐలమ్మ , మల్లు స్వరాజ్యం , ఆరుట్ల కమలాదేవి కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. పోరాట స్పూర్తిని పెంచిందన్నారు. అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల హైదరాబాద్ సంస్థానం .17 సెప్టెంబర్ 1948 నాడు భారతదేశంలో విలీనం అయిందని తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి ప్రత్యేక చర్యల తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వివేక్ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజాపాలనలో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు.
రైతు భరోసాతో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పాం సాగువైపు ప్రజలను మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అంగన్వాడీ సెంటర్లను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం అందిస్తున్నామని.. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులతో ప్రజలకు భరోసా అందిస్తున్నామని తెలిపారు. రామాయం పేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు గుర్తు చేశారు.
