ఫేక్ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు.. అమెరికన్లే టార్గెట్గా సైబర్ మోసాలు

ఫేక్ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు.. అమెరికన్లే టార్గెట్గా సైబర్ మోసాలు
  • సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు ఆధారంగా దర్యాప్తు
  • పాటియాలా, పుణేలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు
  • 66 ఫోన్లు, 13 ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, డిజిటల్ పరికరాలు స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: అమెరికన్లను టార్గెట్‌‌‌‌గా చేసుకుని నడుస్తున్న ఫేక్ కాల్ సెంటర్ స్కామ్‌‌‌‌పై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసినట్లు హైదరాబాద్ జోనల్‌‌‌‌ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో భాగంగా మంగళవారం పాటియాలా, పుణే, చండీగఢ్‌‌‌‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 66 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, హార్డ్ డిస్క్‌‌‌‌లు, కమ్యూనికేషన్ పరికరాలతో పాటు నగదు, కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

గతేడాది రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాటియాలాలో రెండు, పుణేలో ఒక ఫేక్ కాల్ సెంటర్‌‌‌‌ను అధికారులు గుర్తించారు. ఈ మూడు కాల్ సెంటర్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈడీ సోదాలు నిర్వహించే సమయంలో కాల్ సెంటర్లలో సుమారు 220 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి అధికారులు వివరాలు సేకరించారు. 

కాలింగ్ క్యాంపెయిన్‌‌‌‌లు, స్క్రిప్ట్‌‌‌‌లు, డయలర్ సిస్టమ్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) వ్యవస్థలను పరిశీలించారు. అమెరికన్లకు సంబంధించిన డేటా, పేమెంట్ గేట్‌‌‌‌వేల ద్వారా డబ్బుల లావాదేవీలకు ఉపయోగించిన విధానాన్ని కూడా గుర్తించినట్లు ఈడీ తెలిపింది. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, రికార్డులను పరిశీలించి స్కామ్‌‌‌‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెలికితీసే పనిలో అధికారులు ఉన్నారు.