మక్కా గగనతలంలోకి డ్రోన్.. కూల్చివేసిన రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్సెస్

మక్కా గగనతలంలోకి డ్రోన్.. కూల్చివేసిన రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్సెస్
  • తాము ప్రయోగించలేదన్న హౌతీ తిరుగుబాటుదారులు

మక్కా: ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని యెమెన్‌‌‌‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మంగళవారం ఓ డ్రోన్ ను ప్రయోగించారు. అయితే, అది మక్కాలోని అత్యంత పవిత్రమైన, నిషేధిత గగనతలంలోకి ప్రవేశించడానికి ముందే రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ అప్రమత్తమై, రాడార్ ద్వారా గుర్తించి గగనతలంలోనే ఆ డ్రోన్‌‌‌‌ను పేల్చివేశాయి. ఈ ఘటనల నేపథ్యంలో మక్కా తో పాటు జెద్దా, తాయిఫ్ తదితర నగరాల్లో కొద్దిసేపు హై అలర్ట్​ప్రకటించారు. ఈ ఘటన పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ ఘటనపై సౌదీ సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాల్కీ తీవ్రంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా, పవిత్ర స్థలాలను టార్గెట్ చేయడం హౌతీల ఉగ్రవాద చర్యలకు పరాకాష్ట అని మండిపడ్డారు. మక్కా, మదీనా పవిత్ర ప్రదేశాల భద్రత, యాత్రికుల రక్షణ మాకు అత్యంత ప్రాధాన్యమైన 'రెడ్ లైన్' అని ఆయన స్పష్టం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెబుతామని, కఠినమైన ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

కాగా, 2017 జులైలో బాలిస్టిక్ క్షిపణితో జరిగిన దాడి తర్వాత మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన రెండో ప్రయత్నం ఇదేనని అధికారులు తెలిపారు.  అయితే,  మక్కాను లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని హౌతీ రాజకీయ బ్యూరో ప్రతినిధి హజెమ్ అల్-అస్సాద్ పేర్కొన్నారు. తాము ఎప్పుడూ పవిత్ర స్థలాలను టార్గెట్ చేయలేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) మక్కాపై జరిగిన ఈ దాడియత్నాన్ని ఖండించింది.   

భారత్ ఆందోళన..

మక్కాపై జరిగిన డ్రోన్ దాడి యత్నంపై భారత్ బుధవారం ఆందోళన వ్యక్తంచేసింది. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. డ్రోన్ దాడిపై తాము ఆందోళన చెందుతున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.