రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100శాతం తారిఫ్‌లు విధించే లిండ్సే గ్రాహం రష్యా, ఇరాన్ ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఇద్దరు డెమోక్రటిక్ సభ్యులు రిపబ్లికన్లకు అనుకూలంగా వేయడంతో బిల్లు పాస్ అయ్యింది. రష్యాపై ఆంక్షల బిల్లుతోపాటు ఇతర చట్టాలకు సంబందించిన బిల్లు 214–211 ఓట్ల తేడాలో అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందింది ..కాంగ్రెస్ ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లును ఇక సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపనున్నారు. ట్రంప్ ఇప్పటికే దీనిపై సానుకూలంగా స్పందిస్తూ సంతకం చేస్తానని తెలిపారు. రష్యా యుద్ద వ్యయానికి వస్తున్న నిధులను అడ్డుకోవడమే లక్ష్యంగా తారీఫ్ల బిల్లును తీసుకొచ్చింది ట్రంప్ప్రభుత్వం. ట్రంప్ సంతకంతో ఇది చట్టమైతే భారత్ లాంటి దేశాలపై ప్రభావం తీవ్రంగానే అవకాశం ఉంది.
భారత్ ఎగుమతులపై పెను భారం
అమెరికా ఈ చట్టాన్ని ప్రయోగిస్తే, అది నేరుగా రష్యా ముడిచమురు ధరలపై కాకుండా, అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై 100శాతం వరకు అదనపు పన్నుల రూపంలో పడనుంది. అమెరికా మార్కెట్లో ఐటీ, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు-, ఆభరణాలు వంటి రంగాలకు చెందిన భారతీయ ఉత్పత్తులపై విపరీతంగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల అమెరికాలో భారతీయ వస్తువుల డిమాండ్ తగ్గి, భారతీయ ఎగుమతిదారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇంధన భద్రతకు పెద్ద సవాల్..
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తన అవసరాల కోసం రష్యా నుంచి తక్కువ ధరకు లభించే ముడిచమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది.ప్రస్తుతం భారత చమురు దిగుమతులు రష్యా నుంచి 45శాతం నుంచి 51శాతంగా ఉంది. అమెరికా ఆంక్షల భయంతో రష్యా చమురును తగ్గించుకోవాల్సి వస్తే, భారత్ ప్రత్యామ్నాయంగా మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.
భారత్, చైనా 100 శాతం సుంకాలు?
ఈ చట్టం భారత్ వస్తువులపై నేరుగా 100 శాతం సుంకాన్ని విధించదు. దానికి బదులుగా రష్యా మూలం ఉన్న ముడి చమురు లేదా సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై లేదా ఆంక్షల ఎగవేతకు సహకరించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు 100 శాతం వరకు సుంకాలు విధించగల ఒక యంత్రాంగాన్ని ఇది తయారు చేస్తున్నది. డెమోక్రటిక్ ప్రతినిధి స్టెనీ హోయర్ ప్రకారం..హౌస్ సవరణ, రెండో శ్రేణి తారిఫ్ లరూల్స్ కింద 100 శాతం వరకు సుంకాలకు తొలుత అర్హత ఉన్న 10 దేశాలను స్పష్టంగా గుర్తించాలని కోరింది.
100 శాతం సుంకాల లిస్టులోని దేశాలు ..
భారతదేశం, చైనా,యూఏఈ,టర్కీ, అజర్‌బైజాన్,హంగరీ, సింగపూర్,కజకిస్తాన్,కిర్గిజ్‌స్థాన్, స్లోవాక్ రిపబ్లిక్ ఉన్నాయి.
దౌత్యపరమైన, వాణిజ్య చర్చలపై ఒత్తిడి
భారత్,అమెరికాలు ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) పై చర్చలు జరుపుతున్నాయి.అమెరికా తమకు అనుకూలంగా భారత్‌ను ఒప్పించడానికి ఈ 100% టారిఫ్ బిల్లును ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ చేతిలోనే తుది నిర్ణయం
ఈ బిల్లు ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ఇచ్చినప్పటికీ, ఒకవేళ అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమని భావిస్తే ఆ ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు ఇచ్చే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది. గతంలో భారత్ తీసుకున్న కొన్ని సానుకూల చర్యలను బట్టి అమెరికా 25శాతం లెవీని తొలగించింది. రాబోయే రోజుల్లో భారత్ దౌత్య నైపుణ్యంతో ట్రంప్ యంత్రాంగాన్ని ఒప్పించి మినహాయింపు పొందుతుందా లేదా అనేది చూడాలి.
ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్ అమెరికాతో సంబంధాలను కాపాడుకుంటూనే, తన ఇంధన అవసరాలను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందనేది భారత్ ముందర ఉన్న అతిపెద్ద సవాల్..
