కంచె వేసుకునేందుకు భూ యజమానులకు పర్మిషన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ పక్కన సర్వే నం.112, 114లో ఉన్న మూడెకరాల ప్రైవేటు స్థలంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు బుధవారం అధికారులను ఆదేశించింది. గత ఉత్తర్వులకు విరుద్ధంగా తమ స్థలాల్లో అధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు వ్యక్తులు వేర్వేరుగా రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రారెడ్డితోపాటు టీజీఐఐసీ వైస్ చైర్మన్ కె.శశాంక్ ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా హాజరయ్యారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. నానక్‌రామ్‌గూడలోని సర్వే నం.112, 114లో చేపట్టిన భూసేకరణ ప్రక్రియను హైకోర్టు రద్దు చేసిందన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసిందని తెలిపారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ప్రైవేటు వ్యక్తుల భూముల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. అంతేకాకుండా భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసుకునేందుకు భూ యజమానులకు అనుమతి ఇచ్చింది.
