సింగరేణి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా: కార్మికులకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

సింగరేణి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా: కార్మికులకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు:  సింగరేణి అభివృద్ధికి తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్‌‌‌‌17 తెలంగాణ విమోచన దినోత్సవం, జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌‌‌‌లో ఉత్పత్తికి అడ్డంకిగా మారిన అనుమతుల విషయంలో, ఆ తర్వాత.. తాడిచర్ల-2, పీకేఓసీ2 డిప్‌‌‌‌సైడ్ బ్లాక్‌‌‌‌లు సింగరేణికి దక్కేలా ప్రత్యేక చొరవతీసుకున్న సంగతి మీకు తెలిసిందే.

కోయగూడెం-3 కూడా సింగరేణికి చెందేవిధంగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. ఇవన్నీ, సింగరేణి బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు.. సింగరేణి సంస్థ మరో 40, -45 ఏళ్లపాటు తెలంగాణ, దేశ ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషించేలా సింగరేణి కార్మికులకు, మీకు మీ కుటుంబసభ్యుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలనేదే నా ప్రయత్నం’’ అని తెలిపారు.

‘‘దేశానికి వెలుగులు అందిస్తున్న మీ జీవితాల్లోనూ భద్రత, భరోసా ఉండాలి. కార్మికుల ప్రాణాలకు రక్షణ ముఖ్యం. గనికి వెళ్లిన ప్రతి కార్మికుడు పని ముగించుకుని క్షేమంగా ఇంటికి చేరాలి.వారి కుటుంబం.. ఎలాంటి ఆందోళన లేకుండా నిశ్చింతగా ఉండాలి. ఉత్పత్తి పెరగడానికి, ఆర్థికాభివృద్ధి కోసం ఇలాంటి వాతావరణం ఉండటం అత్యంత అవసరం. అందుకే.. కేంద్ర మంత్రిగా బొగ్గు ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణతో సమానంగా కార్మికుల భద్రతకు, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.