- తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి
ఖమ్మం టౌన్, వెలుగు : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉద్యమించాలని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్య బలోపేతం కోసం చేపట్టిన బస్సు యాత్ర బుధవారం ఖమ్మం చేరుకుంది.
ఈ సందర్భంగా తెలంగాణ పీపుల్స్ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ విద్యావ్యవస్థ ప్రస్తుతం ఐసీయూలో ఉందని, ప్రజలే డాక్టర్లుగా మారి దానికి చికిత్స చేసి బతికించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ స్కూళ్లలో ప్రస్తుతం 37 శాతం మంది పిల్లలే చదువుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే.. ప్రభుత్వ స్కూళ్లు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. మూతపడిన స్కూళ్ల లిస్ట్ లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో ప్రతి పిల్లవాడికి విద్య అందాలంటే బడ్జెట్ లో కనీసం 18 శాతం నిధులు కేటాయించాలన్నారు.
ప్రజలకు అవసరమైనసౌకర్యాలు కలిగించే ప్రభుత్వం రావాలంటే నోటు తీసుకోకుండా ఓటేసే స్థితికి ప్రజలు రావాలన్నారు. మండలానికి నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలని, విద్యకు బడ్జెట్ లో 18 శాతం నిధులు కేటాయించాలని తీర్మానం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పద్మజా షా, ఎం. చంపాలాల్, పి.అశోక్ కుమార్, సృజన యాదవ్, పోరన్న, ఎం.నర్సింహారావు, హరీశ్, రుబీనా
పాల్గొన్నారు.
