విదేశీ ఒత్తిడి లేదు..యూపీఐ ఫీజులపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్రం

విదేశీ ఒత్తిడి లేదు..యూపీఐ ఫీజులపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ఫీజులను ప్రవేశపెట్టడం వెనుక ఎలాంటి విదేశీ ప్రభావంలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పూర్తిగా స్వతంత్రంగా తీసుకున్నదేనని తేల్చిచెప్పింది. అమెరికా మెప్పు పొందేందుకే యూపీఐ ఫీజులు తెచ్చారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. ఆర్థికంగా నిలదొక్కుకోగలిగే.. అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సృష్టించడమే కొత్త విధానం లక్ష్యమని పేర్కొంది. 

దేశ ప్రజల ప్రయోజనాల ఆధారంగానే యూపీఐ పాలసీ నిర్ణయాలు ఉంటాయని.. కస్టమర్లకు యూపీఐ సేవలు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఫీజు వర్తిస్తుందని ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఈ భారాన్ని కేవలం వ్యాపారులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఉదాహరణకు రూ.10,000 చెల్లింపు స్వీకరించే వ్యాపారి రూ.40 చెల్లించాల్సి ఉంటుందని.. ఈ ఫీజు గరిష్టంగా రూ.300కి పరిమితమని వివరించింది.

 పర్సన్ టు పర్సన్ మధ్య మనీ ట్రాన్స్ ఫర్, క్యూఆర్ కోడ్ ద్వారా చేసే సాధారణ చెల్లింపులు ఎప్పట్లాగే ఛార్జీలు లేకుండా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అమెరికన్ కార్డ్ కంపెనీలైన వీసా, మాస్టర్‌‌‌‌కార్డ్‌‌‌‌లకు మేలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ ఆరోపించారు.

]యూపీఐ ఉచితంగా ఉండటాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి గతంలో తప్పుబట్టారని, ఆ ఒత్తిడి వల్లే ఇప్పుడు ఛార్జీలు తెచ్చారని విమర్శించారు. దీనిపై స్పందించిన కేంద్రం.. కాంగ్రెస్ వాదనను కొట్టిపారేసింది. యూపీఐ వ్యవస్థ నిర్వహణ, దాని విస్తరణ ఖర్చుల కోసం ఈ ఫీజు ఉపయోగపడుతుందని తెలిపింది.