గుడిహత్నూర్(సిరికొండ), వెలుగు: మారుతున్న జీవనశైలిలో ఎదరవుతున్న ఆరోగ్య సమస్యలకు ఆదివాసీల సాంప్రదాయ ఆహారమైన చిరుధాన్యాలే అసలైన రక్ష అని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆర్‌పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం నారాయణపూర్‌లో బుధవారం నిర్వహించిన ఆదివాసీ ఆహార వైభవం కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
గిరిజన సంస్కృతిలోని బలవర్ధక ఆహారాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఆర్‌పీజీ ఫౌండేషన్ కృషిని అభినందించారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్‌ను పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్.. అధికారులు, గ్రామస్తులతో కలిసి మొక్క నాటారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, ఆర్‌పీజీ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీకర్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ జి.రవికుమార్, సర్పంచ్ విమలాబాయి తదితరులు పాల్గొన్నారు.
