- పెన్షన్ తొలగించారని పురుగుల మందు డబ్బాతో నిరసన
- కార్యాలయం పైనుంచి దూకే యత్నం
ముత్తారం, వెలుగు: తమ పింఛన్లను తొలగించారని మండిపడ్డ దివ్యాంగులు ఎంపీడీవో కార్యాలయం పైకి ఎక్కి మందు డబ్బాలతో నిరసన చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఇప్పలపల్లికి చెందిన సూరం రాజబాబు(56) పెద్దపల్లి సత్తయ్య(90) వైకల్యంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే పింఛన్డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. గత మూడు నెలలుగా వీరికి ఆసరా పింఛన్ ఆగిపోయింది. దీంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ‘గ్రామ సర్పంచ్ చెబితేనే మీ పేర్లు తొలగించాం.. మా చేతుల్లో ఏమీ లేదు’ అంటూ అధికారులు చేతులెత్తేయడంతో బుధవారం పరుగు మందు డబ్బాలతో ముత్తారం ఎంపీడీవో భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
పైనుంచి దూకే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు అక్కడికి చేరుకుని అధికారులు, సర్పంచ్తీరుపై మండిపడ్డారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. తక్షణమే సత్తయ్య, రాజబాబుకు పింఛన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కార్యాలయ సూపరింటెండెంట్ సురేశ్ బాధితులతో చర్చలు జరిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి పింఛన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
