కోల్బెల్ట్: బొగ్గు గనుల్లో వరుస ప్రమాదాలు..పది రోజుల్లో నాలుగు ఘటనలు

కోల్బెల్ట్: బొగ్గు గనుల్లో వరుస ప్రమాదాలు..పది రోజుల్లో నాలుగు ఘటనలు
  • 8 మంది కార్మికులకు గాయాలు
  •     మిస్​ ఫైరింగ్​లు.. రూప్​ ఫాల్​ ఘటనలు
  •     కొత్త ఎలక్ట్రానిక్ బ్లాస్టింగ్ విధానంపై కార్మికుల ఆందోళన
  •     టార్గెట్ కోసం నాన్​ వర్కింగ్ ప్లేస్​లో బొగ్గు వెలికితీత

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కార్మికులను కలవరపెడుతున్నాయి. రక్షణ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కార్మికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో తరచూ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతతో కూడిన బొగ్గు ఉత్పత్తి, రవాణాయే లక్ష్యమని సంస్థ నినదిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మందమర్రి ఏరియాలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఇటీవల నాలుగు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నా ప్రాణనష్టం మాత్రం జరగలేదు. అయితే జరుగుతున్న ప్రమాదాల తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. బ్లాస్టింగ్​లో మిస్​ఫైర్, గనులు పైకప్పులు కూలిన ఘటనల్లో కాస్త ఏమారుపాటుగా ఉన్నా ప్రాణనష్టం భారీగా ఉండేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సూత్రాలపై ప్రచార ఆర్భాటం తప్ప ఆచరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. 

మిస్ ​ఫైర్​లు, బొగ్గు కూలి వరుస ప్రమాదాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట2, కేకే-5 భూగర్భ బొగ్గు గనుల్లో గత పది రోజుల్లో వరుసగా నాలుగు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. ఈనెల 7న కాసిపేట-2 గనిలోని నార్త్​ డిస్ట్రిక్ట్, 22 లెవల్, 18ఎక్స్​ డిప్​ ప్రాంతంలో మ్యాన్​హోల్స్ ఏర్పాటు కోసం కోల్​కట్టర్​ కార్మికులు బ్లాస్టింగ్​పనులు చేపట్టగా డిటోనేటర్​ మిస్​ ఫైర్ ​కావడంతో నలుగురు గాయపడ్డారు. మరుసటి రోజు అదే గనిలోని సౌత్​8వ డిప్​లో కార్మికులు బ్లాస్టింగ్​ నిర్వహించి వెళ్లిన తర్వాత అక్కడి ఎస్​డీఎల్​ యంత్రం బకెట్(బొగ్గు తవ్వేభాగం)లో బ్లాస్టింగ్​జరిగింది. 

అయితే ఎవరికి ఎలాంటి హానీ కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మందమర్రి ఏరియా కేకే-5 గనిలో ఆపరేటర్​కస్తూరి శంకర్​ఎస్డీఎల్​ యంత్రం సహయంతో బొగ్గు వెలికితీస్తుండగా ఒక్కసారిగా పైకప్పు బండరాళ్లు, బొగ్గు పెళ్లలు పెద్ద ఎత్తున కూలడంతో అతడు గాయపడ్డాడు. బుధవారం ఉదయం అదే గనిలో 3 సీము16వ లెవల్ లో బండ కూలడంతో జనరల్ అసిస్టెంట్లు తిరుపతి, శశికుమార్, కోల్ కట్టర్ ఎ.రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. 

ఆందోళనకరంగా ఎలక్ట్రానిక్​ బ్లాస్టింగ్​ విధానం

కొత్త బ్లాస్టింగ్​ విధానంతోనే బొగ్గు గనుల్లో ఇటీవల ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాసిపేట-2 గనిలో రెండు ప్రమాదాలు కూడా బ్లాస్టింగ్​ మిస్​ ఫైర్​ ఘటనలే ఇందుకు నిదర్శనం. కేకే-5 గనిలో జరిగిన ప్రమాదం సైతం ఎయిర్ బ్లాస్టింగ్​ కారణంగానే జరిగింది. గతంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ముందు ఎలక్ట్రికల్​బ్లాస్టింగ్​విధానంలో పేలుడు పదార్థాలను వినియోగించి బ్లాస్టింగ్ చేసేవారు.ఇందులో పదిహేను నిమిషాల్లోనే ఎన్ని డిటోనేటర్లు పేలాయానే విషయం నిర్ధారణకు వచ్చేది. అయితే కొత్తగా చేపడుతున్న ఎలక్ట్రానిక్​ పద్ధతిలో డిటోనేటర్​కు ఛార్జింగ్​ పెట్టి తర్వాత స్కానింగ్​ చేస్తారు. అన్ని సవ్యంగా ఉంటేనే మిషన్​లో డిటోనేటర్ ​ఐడీ కనిపిస్తోంది. అయితే 10 డిటోనేటర్లు నుంచి 9 పేలి, ఒకటి పేలకున్నా.. సాంకేతిక లోపంతో వివరాలు తెలియక పేలుళ్లపై నిర్ధారణకు రాలేని పరిస్థితి. 

డిటోనేటర్ పేలని విషయాన్ని చూపడంతో మిస్ ​ఫైర్​ ఘటనలు జరుగుతున్నాయి. కొత్త విధానం వల్ల పెద్దగా మార్పు లేకపోయినా ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. గతంలో బ్లాస్టింగ్​ఎలక్ట్రికల్ ​విధానం ద్వారా సుమారు రూ.50 ఖర్చు అయితే ఇప్పుడు కొత్త విధానం వల్ల రూ.350కు పైగా వ్యయమవుతోంది. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న డిటోనేటర్లు, ఎక్స్​ఫ్లోజివ్​ సైతం నాసిరకంగా ఉండి, ప్రమాదాలకు కారణమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాత పద్దతిలోనే బ్లాస్టింగ్​ చేపట్టాలని డిమాండ్​చేస్తున్నాయి. టార్గెట్ కోసం నాన్​ వర్కింగ్ ప్లేస్​లోని బొగ్గును సైతం తీయడం ప్రమాదాలకు కారణమవుతుంది. బొగ్గు గనులు, ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టుల్లో సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న మేనేజ్​మెంట్ మాటలు ఆచరణకు నోచుకోవడంలేదని ఆరోపణలున్నాయి.