మహబూబ్నగర్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ సమస్యలపై మూడు నెలలకోసారి తప్పనిసరిగా రివ్యూ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నారాయణపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్ స్వాగతం పలకగా.. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ల్యాండ్, అట్రాసిటీ కేసులు, ఎస్సీ, ఎస్టీల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే సివిల్ రైట్డేలో పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
ఉన్నతాధికారులు స్వయంగా పాల్గొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించిన నిధులు ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు కె.లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శత్రునాయక్, డీఆర్డీవో వెంకట్ రాములు పాల్గొన్నారు.
