నిజామాబాద్, వెలుగు: వానాకాలం సాగు చేసిన వడ్ల కొనుగోళ్లు నిజామాబాద్ జిల్లా నుంచి మొదలవుతాయని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో అక్టోబర్ మొదటి వారం నుంచే కోతలు మొదలుకానున్న నేపథ్యంలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు అంచనాతో మొత్తం 736 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిరుటి కంటే 76 సెంటర్లు పెంచుతున్నట్లు చెప్పారు.
కొనుగోలు చేసిన వడ్లు రైస్ మిళ్లులకు పంపే అవకాశం లేనందున నిల్వ చేసేందుకు గోదాములను గుర్తించాలని ఆదేశించారు. మూతబడిన రైస్ మిల్లలు గోదామ్‌లు, ఫంక్షన్ హాళ్లు, ఇతర ఖాళీ స్థలాలు గుర్తించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్వో గీత, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. నగరంలో నిర్మిస్తున్న కళాభారతి ఆడిటోరియం పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గుండారం, పోతంగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
