- కవితను చూస్తే పాపమనిపిస్తోంది
నిజామాబాద్, వెలుగు: 22ఏ నిషేదిత జాబితాలో చేరిన భూములను ఒకే విడతలో తొలగించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. విడతల వారీగా చేస్తూ దందాలకు దిగితే ప్రజలు గ్రహించలేని అమాయకులు కాదని అన్నారు. నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ధరణిని అడ్డగోలుగా తిట్టిన సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పేరుతో భూములను హారతి పడుతున్నారని ఎద్దేవా చేశారు. తన పాత మిత్రుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నప్పుడు సంతోషించానని, కానీ పరిపాలన ఇలా ఉంటుందని ఊహించలేదన్నారు. రాహుల్ గాంధీ వల్ల జాతీయ స్థాయిలో బీజేపీ పుంజుకున్నట్లు తెలంగాణలో బీజేపీ ఎదుగుదల రేవంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆశీర్వాదమని ఎద్దేవా చేశారు.
కవితను చూస్తే పాపం అనిపిస్తుంది
కల్వకుంట్ల కవితను తండ్రి, అన్న ఇంట్లో నుంచి వెళ్లగొడితే.. ఎన్నికల్లో ప్రజలు తరమి కొట్టారని అర్వింద్ అన్నారు. ఓ పార్టీ పెట్టుకొని తిరుగుతున్న ఆమెను చూస్తుంటే తనకు పాపం అనిపిస్తుందని కామెంట్చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం 7 గంటలకు అన్ని ఇండ్లలో ఆశీర్వాద దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డుచైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్, స్రవంతిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
