- 10 జిల్లాల్లో వంద శాతం కాగా..మరో 10 జిల్లాల్లో 90శాతంపైగా పంటలు
- అన్ని పంటల సాగులో నల్గొండే టాప్
- పత్తిసాగులో నల్గొండ.. వరిలో నిజామాబాద్ఫస్ట్ ప్లేస్..
- వికారాబాద్ జిల్లాలో 1.11లక్షల ఎకరాల్లో కంది వేసిన రైతులు
- వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1 కోటి 24 లక్షల 90 వేల ఎకరాల్లో వానాకాలం సాగు జరిగింది. అంటే సాధారణ సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలుకాగా.. ఇందులో 94శాతం(1.24కోట్లుఎకరాల్లో )వరకు రైతులు పంటలు వేశారు. ఈ మేరకు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ సీజన్సాగులో బుధవారం నాటికి అత్యధికంగా 55.89 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి.
ఆ తరువాత 48.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ రెండు పంటలే 1 కోటి 4 లక్షల ఎకరాలు కాగా.. మిగతా పంటలు కేవలం 20 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మక్కజొన్న 5.93 లక్షల ఎకరాలు, కంది 5.57లక్షల ఎకరాలు, సోయా 3.72 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా.. ఈ మూడు పంటలు 15.22 లక్షల ఎకరాలు సాగైయ్యాయి. వికారాబాద్జిల్లాల్లో లక్షా 11 వేల ఎకరాల్లో రైతులు కంది పంట వేశారు.
ఇక మిగిలిన పంటల్లో పెసర్లు, పల్లీ, మినుములు, జొన్న, సజ్జ, పల్లి, చెరుకు పంటలన్నీ కలిపి మరో 4.78 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ తేల్చింది. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ వానాకాలం సీజన్లో 94శాతం పంటల సాగు జరగడం గమనార్హం. నిరుడు ఇదే టైంకు 1.32కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నిరుడు కంటే 7.41లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది.
సాగు శాతం ఎక్కడెక్కడ ఎంతంటే..!
ఈ సీజన్లో పది జిల్లాల్లో వంద శాతం కంటే అధికంగా పంటల సాగు జరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, మేడ్చల్ జిల్లాలో పంటల సాగు 100 శాతం నమోదైంది. వానాకాలం పంటల సాగులో నల్గొండ జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ ఒక్క జిల్లాలోనే 9.91లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 7.05 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 5.88 లక్షల ఎకరాలు, నిజామాబాద్జిల్లాలో 5.48 లక్షల ఎకరాలు , వికారాబాద్‌జిల్లాలో 5.35 లక్షల ఎకరాలు, సిద్ధిపేట జిల్లాలో 5.05 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 5.03 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది.
నిజామాబాద్‌లోనే వరి ఎక్కువేసిన్రు
ఈ వానాకాలం సీజన్లో అత్యధికంగా సాగైన పంటల్లో వరి మొదటి స్థానంలో ఉండగా, నిజామాబాద్జిల్లాలో అధికంగా 4.36 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఈ జిల్లాల్లోనే అత్యధికంగా వరిసాగు జరిగినట్లు వ్యవసాయశాఖ తేల్చింది. ఆ తరువాత నల్గొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3.45 లక్షల ఎకరాలు, సిద్ధిపేట జిల్లాలో 3.16 లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో తేల్చింది.ఇక, పత్తి పంటసాగులో నల్గొండ జిల్లా 5.93 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆదిలాబాద్ 4.37 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్జిల్లాలో 3.77లక్షల ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 3.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగినట్లు నివేదిక పేర్కొంది.
