రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు, మెట్రో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ బుల్లెట్ రైళ్లు మంజూరు చేస్తామని, హబ్ కోసం భూమి కావాలని అడిగారు. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై (వయా అమరావతి), హైదరాబాద్–ముంబై (వయా పుణె) మార్గాల్లో రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చే 3 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని బహదూర్‌గూడ ప్రభుత్వ భూమిలో 400 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులన్నీ నగరంలోకి రాకుండా అక్కడే ఆగేలా అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక బస్ టెర్మినల్, హైదరాబాద్ నుంచి ప్రయాణించే మెట్రో రైలు కనెక్టివిటీ హబ్‌ను అక్కడ నిర్మించాలని మేం సంకల్పించాం. కానీ గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సుధీర్‌రెడ్డి, మా సబితమ్మ కలిసి.. రేవంత్‌రెడ్డి భూములు లాక్కుంటున్నాడంటూ ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తున్నారు.
సర్కారు భూమిని ఆక్రమించుకున్నామని, అక్కడ ప్రభుత్వం కాలు పెట్టడానికి వీల్లేదని వీరు బుకాయిస్తున్నారు. వీరి ప్రతి ధర్నా వెనుక ఒక భూదాహం, దోపిడీ, స్వార్థం దాగి ఉన్నాయి. ఆనాడు మంత్రులుగా ఉన్నప్పుడు దొంగ డాక్యుమెంట్లతో చెరబట్టిన 650 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రాజెక్టుల కోసం తీసుకుంటుంటే వీరు గగ్గోలు పెడుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుల విషయంలో ఎవరి బెదిరింపులకూ ప్రభుత్వం తలొగ్గే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.
గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌తో క్విడ్ ప్రో కో
మియాపూర్ భూ కుంభకోణంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌తో బీఆర్‌ఎస్ నాయకత్వానికి క్విడ్ ప్రో కో సంబంధాలున్నాయని సీఎం వెల్లడించారు. మియాపూర్ పరిధిలోని అత్యంత విలువైన సీఎస్–7, సీఎస్–14 సర్వే నంబర్ల భూముల్లో గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌తో కలిసి గత ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల రూపాయల దందాలు నడిపారని ఆరోపించారు. ‘‘అసలు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఎవరికి బంధువు? ఎవరి అండతో ఈ దందాలు సాగాయి? మియాపూర్ భూముల గురించి కృష్ణారావు వచ్చి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరడం, దానికి అప్పటి మంత్రి హరీశ్‌రావు ఆగమేఘాల మీద ఆమోదం తెలపడం వెనుక మతలబు ఏంటి?’’ అని సీఎం ప్రశ్నించారు.
ఒక సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉండాల్సిన భూములను నిబంధనలకు విరుద్ధంగా మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారని ఆరోపించారు. ఆనాడు తానే స్వయంగా ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను బయటపెట్టడం వల్లే గత్యంతరం లేక సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారని గుర్తుచేశారు. ఈ భూదోపిడీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను ఎవరూ ముట్టుకోలేదని స్పష్టం చేశారు.
