అమెరికా ఫెడరల్ రిజర్వ్ 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచింది. ఇదే సమయంలో భవిష్యత్తులోనూ కఠిన విధానాలు అవలంబిస్తామని సంకేతాలు ఇవ్వడంతో భారతీయ రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. సెప్టెంబర్ 17న డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 96 మార్కును అతిక్రమించి 96.03 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్‌లో ఇది 95.95 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు మన దేశ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని అణచివేసేందుకు ఫెడ్ తన బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.75% - 4% శ్రేణికి చేర్చింది. మరోవైపు మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 105 డాలర్ల పైన స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు క్రూడ్ సహా ఇతర వస్తువులకు రవాణా అంతరాయం కలిగించడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతున్నాయి. దీనివల్ల జపాన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచవలసి వస్తోంది.
అంతర్జాతీయ పరిణామాలతో అక్టోబర్లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో RBI కూడా రెపో రేట్లను పెంచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పబారి మాట్లాడుతూ.. రూపాయి ఇప్పటికే 96 స్థాయి వద్ద ఒత్తిడిని ఎదుర్కొంటోందని, భవిష్యత్తులో పరిస్థితి మరింత అనుకూలంగా లేకపోతే రూపాయి విలువ స్వల్పకాలంలో 96.30 - 96.50 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు.
ఈ రేట్ల పెంపు ధోరణి రూపాయిపై మరింత భారాన్ని మోపుతోంది. ఇప్పటికే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవటం, క్రూడ్ ఆయిల్ రేట్ల భయాలు మన కరెన్సీని బలహీనపరుస్తున్నాయి. ఫెడ్ తదుపరి సమావేశంలో మరో వడ్డీ రేటు పెంపు ఉండే అవకాశం 50 శాతం మేర ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు రూపాయిని మరింత రక్షణాత్మక ధోరణిలోకి నెడుతున్నాయి.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్, గ్లోబల్ పరిస్థితులను పరిశీలిస్తే.. రూపాయి రానున్న రోజుల్లో మరింత దిగజారి డాలర్‌తో పోలిస్తే ప్రతికూలమైన 100 మార్కును చేరుకుంటుందా అనే ఆందోళన అటు ప్రభుత్వంతో పాటు ఇటు వ్యాపార వర్గాలను, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడం, ఫెడ్ మరిన్ని పెంపులకు సిద్ధమవడం వంటి కారణాలరీత్యా, రూపాయిపై ఒత్తిడి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో 100 మార్కును తాకే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే దిగుమతుల ఖర్చులు పెరిగి అవి మెల్లగా రోజువారీ ప్రయాణం నుంచి తిండి వరకూ ప్రతిదీ ఖరీదైనదిగా మారుస్తుందని నిపుణులు అంటున్నారు.
