ఖమ్మం టౌన్, వెలుగు : మార్ఫింగ్ ఫొటోలతో ఓ యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన బాలిక ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఈ ఘటన ఖమ్మం నగరంలో బుధవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్ బ్లాక్ నెంబర్ 13కు చెందిన ఓ మహిళ తన కూతురితో కలిసి ఉంటోంది. బాలిక ఓ కిరాణ షాపులో పనిచేస్తుండగా.. నిత్యం అక్కడికి వచ్చే ఆర్మన్ తో పరిచయం అయింది. అతడు షాపు వద్దకు వచ్చిన ప్రతీసారి బాలిక ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఆమె ఫొటోలను పవన్ అనే యువకుడికి పంపించేవాడు. తర్వాత వాటిని డిలీట్ చేసేవాడు.
పవన్.. తన ఫొటోలు, బాలిక ఫొటోలను కలిపి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బాలికకు పంపుతూ వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 6వ తేదీన ఎలుకల మందు తింది. మూడు రోజుల తర్వాత బాలిక వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
బాలిక ఆత్మహత్యాయత్నానికి ఆర్మన్ కారణమని భావించిన బాలిక తల్లి ఈ నెల 10న ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆర్మన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా... అతడు పవన్ విషయం చెప్పడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే ఎంజీఎంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బాలిక బుధవారం చనిపోయింది. కాగా, బాలిక కుటంబానికి న్యాయం చేయాలంటూ.. బాలిక డెడ్ బాడీతో టేకులపల్లి బైపాస్ రోడ్డులో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
